ఎకరాకు రూ.కోటి ఇవ్వండి
● గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు బాధితుల డిమాండ్
● అందరికీ సమాన పరిహారం
ఇవ్వాలని అభ్యర్థన
● నిర్వాసితులతో ఎంపీ మల్లు రవి,
అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశం
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం అందించాలని మర్రిపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు తదితరులు బుధవారం కలెక్టరేట్‌లో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని, భూమి కొల్పోతున్న తమకు ఎకరాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఎకరాకు రూ.25 లక్షల పరిహారం సరిపోదని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ మొదటి మార్గం రావిర్యాల నుంచి చివరి మార్గం ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం అందించాలని కోరారు.
రూ.25 లక్షల పరిహారం..
అడిషనల్ కలెక్టర్, భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో పూర్తిగా భూమి కోల్పోతున్న బాధితులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.5.60 లక్షల చొప్పున పరిహారం, కోల్పోయిన భూమి ఆధారంగా 60 గజాల నుంచి 480 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.
న్యాయం జరిగేలా చూస్తాం..
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ బాధితులకు ప్రైవేట్ ఉద్యోగంతో పాటు, కడ్తాల్‌లో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మరింత మేలైన పరిహారం ఇచ్చే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి గ్రామ సర్పంచ్ ఈర్లపల్లి రవి, రైతులు రచ్చ శ్రీరాములు, నారయ్య, మల్లేశ్‌గౌడ్, సత్తయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు.


