హిందువులకు రక్షణ కల్పించాలి
శంకర్‌పల్లి: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం రాత్రి శంకర్‌పల్లి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులను కాపాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రంగానాథ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు చేయడం ఆమానుషమని, దీనిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వారికి రక్షణ కల్పించాలని, బాధ్యులపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మొయినాబాద్: తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓల) అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మొయినాబాద్ ఏఈఓ ఎన్.సునీల్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాజేంద్రనగర్‌లో జరిగిన రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సునీల్‌కుమార్‌తోపాటు కార్యదర్శిగా శివతేజగౌడ్, ట్రెజరర్ రాఘవేంద్రకుమార్‌లను ఎన్నుకున్నారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాజేంద్రనగర్ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, టీఎన్‌జీఓ తాలూకా అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఈఓలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంచాల: బొలెరో వాహనం ఫల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన రంగాపూర్ సమీపంలో కోళ్ల వంపు వాగు మలుపు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెం గ్రామానికి చెందిన ఓడుసు శివ(25) అతని స్నేహితులు యావ శంకర్, ఎడ్ల నాగరాజుతో కలిసి లోయపల్లి నుంచి రంగాపూర్ వైపు బొలెరో వాహనంపై వస్తున్నారు. రంగాపూర్ సమీపంలో చేరుకోగానే కోళ్ల వంపు వాగు మలుపు వద్ద రోడ్డుపై అతి వేగంగా వచ్చి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శివకు బలమైన గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న మంచాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వెంటనే 108 అంబులెన్స్‌లో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని..
మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కొంపల్లికి చెందిన కృష్ణ, నాగమణి(42) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపానికి లోనైన నాగమణి బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా ఫాక్స్‌సాగర్ సమీపంలో చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హిందువులకు రక్షణ కల్పించాలి


