‘డబుల్’ నిరసన
● అనర్హులు ఇళ్లు తీసుకున్నారని
మహిళల ఆందోళన
● పేదలను గుర్తించాలని
ప్రభుత్వానికి అభ్యర్థన
తుక్కుగూడ: అర్హులైన తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం తుక్కుగూడ జీహెచ్‌ఎంసీ డివిజన్ పరిధిలోని సర్ధార్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లాటరీ పద్ధతిన అర్హులకు కేటాయించిందని తెలిపారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి, ఒక్కొక్కరు మూడు, నాలుగు ఇళ్ల చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. కొంత మందికి పట్టాలు ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వమైనా అనర్హులను తొలగించి, పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.


