హైవేపై హోర్డింగ్‌ల తొలగింపు
యాచారం: అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్‌లను అధికారులు తొలగిస్తున్నారు. పంచాయతీలకు ఆదాయం లేకుండా ప్రచారం కోసం వ్యాపారులు నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జీపీలకు కనీస సమాచారం లేకుండా సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి మాల్ వరకు వందలాదిగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, వస్త్ర వ్యాపారం, విద్యాలయాలు, ఆస్పత్రుల తదితర ప్రైవేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ ఇష్టానుసారంగా ప్రకటనలు ఏర్పాటు చేస్తున్నారు. అవి రోడ్డుకు దగ్గరగా ఉండడంతో రాకపోకలు సాగించే వాహనాలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు అనుమతులు ఉండడంతోనే వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ సంస్థల ప్రచారం కోసం హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రజలు భావించారు. కానీ ఏ ఒక్క సంస్థ కూడా పైసా పన్ను చెల్లించకుండానే భారీ ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా హోర్డింగ్‌లు బిగిస్తున్నారు.
హైవేపై 200లకు పైగానే..
సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు 200లకు పైగానే భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాచారం పంచాయతీ శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం సాగర్ హైవేతో పాటు 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించేశారు. ఇకపై అనుమతి లేకుండా ప్రకటనలు చేయవద్దని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ కోసం, వివిధ ఆఫర్ల పేరుతో హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పంచాయతీలకు ఆదాయం పెంచడం కోసమే హోర్డింగుల తొలగింపునకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ చిన్న హోర్డింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా.. ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన అనుమతి పత్రాలు, బాధ్యులైన వారి పేర్లతో కూడిన దరఖాస్తులు చేసుకుంటే నిర్ణయించిన ఫీజులు చెల్లించిన తర్వాత, నిర్ణీత గడువు వరకే అనుమతులు మంజూరు చేస్తారు. గడువు లోపు తొలగించకపోతే పంచాయతీ సిబ్బంది తొలగిస్తారు. లేని పక్షంలో ఆలస్యం కింద భారీ జరిమానాలు వసూల్ చేసే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల ఆదేశంతో
కదిలిన యంత్రాంగం
అనుమతులు లేకుండా
ఏర్పాటు చేయొద్దని సూచన
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
జీపీల ఆదాయం పెంచడంపై
అధికారుల కృషి
హైవేపై హోర్డింగ్‌ల తొలగింపు


