అవకతవకలపై మహిళలే నిఘా పెట్టాలి
డీఆర్‌డీఏ డీపీఎం లీలాకుమారి
యాచారం: డ్వాక్రా సంఘాల్లో నిధుల అవకతవకలపై మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లు నిఘా పెట్టాలని డీఆర్‌డీఏ డీపీఎం లీలాకుమారి పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘అప్పు కట్టలేక.. కంటికి కునుకు లేక’ అనే కథనంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆమె మండలంలోని 24 గ్రామాలకు చెందిన మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పాటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని గ్రామాల్లో రూ.లక్షలాది నిధులు అక్రమాలు జరుగుతుంటే, ఆ గ్రామాల అధ్యక్షురాళ్లు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. పర్యవేక్షణ చేయాల్సిన ఐకేపీ సిబ్బంది, ఉద్యోగులు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. యాచారం మండలంలో గతేడాది మల్కీజ్‌గూడ, ఈ ఏడాది చౌదర్‌పల్లి గ్రామంలో జరిగిన డ్వాక్రా సంఘాల నిధుల అక్రమాలు జిల్లాలో సంచలనంగా మారాయని అన్నారు. మహిళలకు చెందాల్సిన డబ్బులను స్వాహాకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐకేపీ ఏపీఎం రవీందర్‌తో పాటు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
అవకతవకలపై మహిళలే నిఘా పెట్టాలి


