వేములవాడ: వేములవాడ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో వాటి వసూలు కోసం అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఎన్పీడీసీఎల్ డీఈ వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం వేములవాడలో పోల్ టు పోల్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ సహకారంతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల పనులు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. బకాయిల వసూళ్ల కోసం వేములవాడ టౌన్ పరిధిలో సుమారు 50 మంది సిబ్బందితో ‘పోల్ టు పోల్’ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
బీమన్న ఆలయంలో పూజలు
వేములవాడ: వేములవాడ భీమన్నను మహారాష్ట్రలోని అమరావతి రూరల్ అదనపు ఎస్పీ దత్తా లక్ష్మణ్ టోటేవాడ్ దంపతులు గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు.
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
తంగళ్లపల్లి: మండలంలోని తాడూర్‌లో సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగెల రాజు చేతులమీదుగా లబ్ధిదారులకు స్టార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ల భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీరామ్ గౌడ్, గడ్డమీది శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.
నియామకపత్రం అందజేత
సిరిసిల్లటౌన్: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మూడోసారి ఎన్నికై న కాముని వనితను జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ అభినందించారు. గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు నియామక పత్రం అందించారు.
పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి
బోయినపల్లి: యాసంగిలో పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఏవో కే. ప్రణీత పేర్కొన్నారు. మండలంలోని జగ్గారావుపల్లి గ్రామంలో సర్పంచు సుద్దాల మధు అధ్యక్షతన రైతులకు గురువారం పంటల సాగుపై అవగాహన కల్పించారు. సర్పంచ్ సుద్దాల మధు, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఏఈవో హరీశ్, కార్యదర్శి సౌజన్య తదితరులు ఉన్నారు.
రుద్రంగి: మండలంలోని మానాల, గిరిజన తండా గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం మార్కెట్‌కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి
ముస్తాబాద్: ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చిగురు నరేశ్ అన్నారు. తహసీల్దార్ ఫారూక్‌కు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతూ గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కేంద్రాలు ప్రారంభించిందని, ఒక్క బస్తా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గన్నెవారిపల్లె సర్పంచ్ రేసు రఘు, చీకొడు సర్పంచ్ అంజనేయులు, కరుణాకర్ ఉన్నారు.
దొంతగనం కేసులో
నిందితుని అరెస్టు
గంభీరావుపేట: లింగన్నపేటలో జరిగిన దొంగతనం సంఘటనకు సంబంధించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి, బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. నిందితుడు సిద్దిపేట జిల్లా పుల్లూరుకు చెందిన ఒగ్గు రోహిత్ నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


