ఈవోకు వినతి | - | Sakshi
Sakshi News home page

ఈవోకు వినతి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు గురువారం ఈవో రమాదేవిని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. తమను పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఔట్‌సోర్సింగ్‌ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య ఆదేశాల మే ర టకు జిల్లా జేఏసీ ఉపాధ్యక్షుడు దయ్యాల కొమర య్య, బొప్ప శేఖర్‌, కూలేరు సాగర్‌, కార్యదర్శి క్యా తం నరేశ్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

గంభీరావుపేట: స్కూల్‌గేమ్స్‌ రాష్ట్రస్థాయి అండర్‌–17 హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు సంజన, వర్షిత, జాన్‌వెస్లీ, మధు, భావన ఎంపికయ్యారు. వీరిని కోచ్‌ భాను, హెచ్‌ఎం నారాయణ, సర్పంచ్‌ బాలరాజుగౌడ్‌ అభినందించారు.

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక

సిరిసిల్లటౌన్‌: జిల్లాకేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 బాలికల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాఠశాలకు చెందిన మాలోత్‌ అక్షిత (7వ తరగతి), ఎండీ. అయేషా సిద్దిఖ్‌ (8వ తరగతి) గురువారం కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. ఈ నెల 13 నుంచి 15 వరకు బీబీపేట్‌లోని టీఎస్‌ఎన్‌ఆర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయురాలు శారద, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేశ్‌ అభినందించారు.

హ్యాండ్‌బాల్‌ పోటీలకు..

చందుర్తి: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు నర్సింగపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు జితేందర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు జెట్టిపల్లి అశోక్‌ తెలిపారు. నర్సింగపూర్‌ పాఠశాలకు చెందిన ఎన్‌.నిహారిక, పి.అన్విత్‌రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 15 వరకు మహబూబ్‌నగర్‌ పాఠశాల భగీరథ కాలనీలో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు జితేందర్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు షీల్డ్‌ అందజేసి అభినందించారు.

ఇసుక రీచ్‌ రద్దు చేయాలి

ఎల్లారెడ్డిపేట: మానేరు వాగు నుంచి రాత్రిపూట అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని మండలంలోని పదిర గ్రామ పంచాయతీ ఎదుట గురువారం రైతులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని కోరారు. ఇసుక రీచ్‌ నుంచి నిత్యం ఇసుక తరలిస్తుండడంతో భూగర్భజలాలు అడుగంటి మోటార్లు ఎత్తిపోతున్నాయన్నారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో సాగునీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు తహసీల్దార్‌ దివ్యజ్యోతికి వినతిపత్రం అందజేశారు. రైతులు మద్దుల బుగ్గారెడ్డి, కొమురయ్య, కంచర్ల సాయిలు, వంగ పద్మారెడ్డి, రామచంద్రారెడ్డి, రాజిరెడ్డి, రామచంద్రం, రాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

పురుగుల మందు డబ్బాతో ఆందోళన

పదిర మానేరు వాగులోని ఇసుక రీచ్‌ వద్ద ట్రాక్టర్లలో ఇసుకను లోడ్‌ చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన రైతు కంచర్ల రాజు పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశాడు. ట్రాక్టర్లలో ఇసుకను నింపొద్దని అడ్డుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాజును సముదా యించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement