వేములవాడలోని ప్రధాన రోడ్లపైనే
మురికినీరు
కంపుకొడుతున్న పట్టణంలోని కాలనీలు
పట్టించుకోని పాలకులు
ఇబ్బందిపడుతున్న జనం
ఇది వేములవాడలోని 11వ వార్డులో ఉర్దూ మీడియం స్కూల్ పక్కనే మురికికూపం. మురికినీరు నిలిచిపోవడంతో పందులు సంచరిస్తున్నాయి. దోమలు, ఈగల బెడదతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల సమీపంలోనే మురికి నీరు పెద్ద ఎత్తున నిల్వ ఉండటం వల్ల విద్యార్థులు తరచూ రోగాల బారిన పడుతున్నారు.
●ఇది వేములవాడ పట్టణంలోని మల్లారంరోడ్డులో ఆటోస్టాండ్ ప్రాంతం. ప్రధాన రోడ్డు పక్కన మురికినీరు ప్రవహిస్తోంది. మురికినీటిలో నుంచి వెళ్లడం ప్రయాణికులు ఇబ్బందిగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోంది. ఆటోలు నిలిపే ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
●ఇది వేములవాడలోని షాపింగ్ ఏరియా కోరుట్ల బస్తాండ్. ఇక్కడ వాణిజ్య సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. రోడ్డును ఆనుకుని మురికినీరు ప్రవహిస్తుండడంతో పట్టణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దుకాణాల ముందు నుంచే మురికినీరు పారుతుండడంతో వివిధ పనులపై వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు.
వేములవాడ: వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ముక్కుపుటాలు అదిరేలా కంపు వాసన వస్తోంది. ప్రధాన రోడ్లపై నుంచే మురికినీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు, పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల వెనుక భాగంలో మురికినీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ అపరిశుభ్ర వాతావరణంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు, ఈగలు పెరిగి రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది.
రోడ్లపైనే మురుగు ఏరులై..
పట్టణ శివారు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలోంచి వచ్చే మురికినీరంతా నేరుగా ప్రధాన రహదారులపైకి చేరుతోంది. రోడ్డు పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి, మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మురికి నీటిలో నుంచే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది.
వేములవాడ శివారు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం పారిశుధ్య సిబ్బందితో తాత్కాలికంగా పనులు చేపడుతున్నాం. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. వారంలో రెండు రోజులు ఫాగింగ్ చేయిస్తున్నాం.
– లోకేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ


