ఎల్‌నినో ఎఫెక్ట్
1.25 లక్షల ఎకరాల్లోనే పంటలు
గత యాసంగిలో 1,83,850
ఎకరాల్లో సాగు
ఆరుతడి పంటల వైపు రైతుల దృష్టి
సగానికి పైగా పడిపోనున్న వరి విస్తీర్ణం
చందుర్తి: ఎల్‌నినో ప్రభావంతో సాగు ప్రణాళిల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణంగా వరికే అధిక ప్రాధాన్యతనిచ్చే రైతులు ఈసారి నీటివనరుల పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రణాళికలో మార్పులు
గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 1,83,831 ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ప్రస్తుత సీజన్‌లో 1,25,907 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 70వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గేలే కనిపిస్తుంది. గతేడాది 1,83,850 ఎకరాల్లో వరి సాగుచేశారు. కేవలం మొక్కజొన్న పంటతోపాటు ఇతర పంటలను 10వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఈయేడు యాసంగిలో 1,25,907 ఎకరాల్లో 71,810 ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా.. మిగతా 55వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని వ్యవసాయాధికారుల అంచనాలు చెబుతున్నాయి.
వరిసాగుకు నీటి గండం
జిల్లాలో వానాకాలం లోటు వర్షపాతం, దీర్ఘకాలిక పొడి వాతావరణం కారణంగా పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావితం చూపింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని యాసంగిలో వరిసాగుపై రెండింతలు తగ్గనుంది. గత యాసంగిలో 1,83,831 ఎకరాల్లో వరిసాగు చేస్తే ప్రస్తుత సీజన్‌లో 71,810 ఎకరాల్లో వరి వేస్తారని వ్యవసాయాధికారులు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరుతడి పంటల సాగుపై ప్రచారం
యాసంగిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని సాగునీటి వనరుల్లో ఆశించిన మేరకు నీరు లేకపోవడంతోపాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు ఆశించిన మేరకు వర్షాలు లేక వెలవెలబోతున్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న 2,135 ఎకరాల్లో సాగుచేస్తే ఈ యాసంగిలో 23,162 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. పప్పు దినుసులు 4వేల ఎకరాలు, నూనెగింజల పంటలు 15వేల ఎకరాలు, కూరగాయలు 1500 ఎకరాలు, ఆయిల్‌పామ్ 1200 ఎకరాలు, ఇతర పంటలు 7 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


