అధ్వానంగా ఎడమకాలువ
పూర్తికాని భూసేకరణ
2 కిలోమీటర్లు పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగునీరు
అడ్డంకిగా గ్రానైట్ క్వారీలు
మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో చిగురిస్తున్న ఆశలు
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ఎడమకాలువ పనులపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంతో ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లెఫ్ట్‌కెనాల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో ఎడమకాలువ పరిస్థితి, దాని పరిధిలోని ఆయకట్టుపై చర్చ సాగుతోంది. ఈ కాలువ పూర్తయితే దాదాపు 10వేల ఎకరాలు సాగులోకి వస్తాయి.
● పిచ్చిమొక్కలతో నిండిన కాలువ
బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి నుంచి ప్రారంభమైన మిడ్‌మానేరు ఎడమకాలువ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాల వరకు 16.085 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. కొన్నాళ్ల క్రితం 14.3 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తి చేశారు. మిడ్‌మానేరు నుంచి నీరు విడుదల చేస్తే బోయినపల్లి, గంగాధర, కొత్తపల్లి మూడు మండలాల్లో 10,500 ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కానీ క్షేత్రస్థాయిలో 14.3 కిలోమీటర్ల వరకే కాలువ పూర్తి చేసి, నాలుగున్నరేళ్లుగా రెండు కిలోమీటర్ల మేర నిర్మాణం మొదలు చేయకపోవడంతో ఆశయం నెరవేరడం లేదు.
● రెండు ఓటీ(మైనర్స్) క్యాన్సిల్‌కు ప్రతిపాదనలు?
గంగాధర మండలం గట్టుబూత్కూర్ పరిసరాల్లో గ్రానైట్ క్వారీలు ఉండడంతో కాలువ పనులు అక్కడితోనే ఆగిపోయాయి. ఈ ప్రాంతంలో కాలువ పనులు చేయరాదని, అక్కడ ఉన్న రెండు ఓటీ(మైనర్స్) క్యాన్సిల్‌కు గతంలో ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీంతో రెండు కిలోమీటర్ల మేర 5,116 ఎకరాల ఆయకట్టుకు నీరు అందడం కుదరదని పేర్కొన్నట్లు తెలిసింది.
● మొదలుకాని కొత్తపేట–మల్లాపూర్ కెనాలు
నర్సింగాపూర్ 2ఆర్, 1ఆర్‌ల నుంచి భూసేకరణ జరిగితే బోయినపల్లి మండలం కొత్తపేట నుంచి మాన్వాడ, మల్లాపూర్ వరకు పిల్లకాలువ పనులు చేయొచ్చు. దీని కోసం నర్సింగాపూర్, కొత్తపేట, మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లో 28.18 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. ఇది పూర్తయితే బోయినపల్లి మండలంలోని పై నాలుగు గ్రామాల్లో 2,300 ఎకరాలకు సాగునీరు అందుతంది.
గ్రానైట్ క్వారీలతో ఆగిన పనులు?
లెఫ్ట్‌కెనాల్ పనులు గంగాధర మండలం గట్టుబూత్కూర్ చెరువు వరకు నిర్మించారు. ఆ చెరువును ఆనుకునే గ్రానైట్ క్వారీలు ఉండడంతో రెండు కిలోమీటర్ల మేర పనులు అర్ధంతరంగా నిలిపివేశారు. ఆ రెండు కిలోమీటర్ల పనులకు గ్రానైట్ క్వారీలు అడ్డంకిగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి.
వెంకట్రావుపల్లి పరిసరాల నుంచి మొదలైన ఎడమకాలువ పిచ్చిచెట్లు, ముళ్లచెట్లతో నిండిపోయింది. గతంలో నర్సింగాపూర్ చెరువులోకి నీరు విడుదల చేయగా పలు చోట్ల కాలువ తెగిపోవడంతో నీటి విడుదలను నిలిపివేశారు. గంగాధర, కొత్తపల్లి మండలాల్లో గ్రానైట్ క్వారీలతో రెండు కిలోమీటర్ల మేర కాలువ పనులు ఆగడం.. బోయినపల్లి మండలం కొత్తపేట, మాన్వాడ, మల్లాపూర్‌లలో 28 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండడమే ప్రధాన అడ్డంకిగా మారాయి.


