● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో నిర్ధేశించిన ఆయిల్‌పామ్ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. రైతులకు అవగాహన కల్పిస్తూ సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం సకాలంలో అందేలా ఉద్యాన, వ్యవసాయశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
జలసిరి పనులతో నీటి సంరక్షణ
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, జలసిరి పనులతో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ నుంచి గురువారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ ఇంజినీర్లతో మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆగస్టు 15 నాటికి మండలాల వారీగా నిర్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
మండల స్థాయిలో ప్రజావాణి
సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ తెలిపారు. ప్రతీ సోమవారం(పని దినాల్లో) మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మండలస్థాయి అధికారులు అందరూ హాజరుకావాలని సూచించారు. జెడ్పీ సీఈవో, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఏవో అఫ్జల్‌బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.


