సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, బాల సాహితీవేత్త, తెలుగునాట బాలసాహిత్య వికాసం కోసం కార్యశాలలు నిర్వహిస్తున్న డాక్టర్ పత్తిపాక మోహన్ తెలంగాణ బాల సాహితీవేత్త, తెలంగాణ జీవభాషలో బాలల సాహిత్యం సృజన చేసిన రచయిత ‘పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం– 2026కు ఎంపికయ్యారు. బాలల కోసం కథలు, తెలంగాణ భాషలో కథలు, పొడుపు కథలు, జానపద కథలు రాసి ప్రచురించారు. స్వయంగా కార్టునిస్టు, చిత్రకారుడైన పెండెం అనేక పత్రికలకు కార్టున్లను గీశారు. పెండెం జ్ఞాపకంగా ఆయన మిత్రులు, సాహితీవేత్తలు జాతీయ పురస్కారం నెలకొల్పి అందిస్తున్నారు. ఈనెల 19న నల్గొండలో జరిగే సభలో మోహన్‌కు పురస్కారం, నగదు, ప్రశంసాపత్రం అందించి సత్కరిస్తారని అవార్డు కమిటీ పక్షాన ఆచార్య కృష్ణ కౌండిన్య తెలిపారు. మోహన్‌కు అవార్డు రావడంపై రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగొండ రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, మానేరు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు టీవీ నారాయణ, గెంట్యాల భూమేశ్, డాక్టర్ చిటికెన కిరణ్‌కుమార్, బూర దేవానందం, జిందం అశోక్, జి.మడూరి అనిత, సౌమ్య, దూడం గణేశ్, అంకారపు రవి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
టీజీ టెట్‌లో సత్తాచాటిన ఉపాధ్యాయుడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంప లక్ష్మీనారాయణ టీజీ టెట్‌లో జిల్లా ఇన్ సర్వీస్ టీచర్ నుంచి రాష్ట్ర ఒకటో ర్యాంకు సాధించాడు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యాశాఖ నిర్వహించిన టీజీ టెట్ 2026 ఫలితాల్లో 150 మార్కులకు 114 మార్కులు సాధించారు. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి బోధించే ఉపాధ్యాయుల కోసం జరిగిన పేపర్ 2 గణితం, సైన్స్ విభాగంలో జిల్లాలో ఒకటో ర్యాంకు సాధించడం గర్వకారణం. ప్రభుత్వం నిర్ణయించిన ఉత్తీర్ణత మార్కులు జనరల్ 90, బీసీ 75, ఎస్సీ, ఎస్టీ 60 కాగా లక్ష్మీనారాయణ 114 మార్కులు సాధించి అందరికంటే ముందు నిలిచారు. 27 ఏళ్లుగా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ విద్యార్థులకు ఎంతో ఇష్టమైన టీచర్. పాఠాలను ప్రయోగాలతో ఆసక్తికరంగా బోధించడంలో ప్రత్యేకత సాధించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణను పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
మెనూ పాటించాలి
వేములవాడ: వేములవాడలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా జూనియర్ కళాశాలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ లోకేశ్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలోని పారిశుధ్యం, విద్యార్థినులకు అందిస్తున్న భోజన వసతులను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అలాగే భావితరాల కోసం నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
వేములవాడరూరల్: వేములవాడ మార్కెట్ యార్డులోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పినట్లుగానే పట్టణంలో అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్కెట్ యార్డులో ఉన్న కార్యాలయంలోకి మార్చేందుకు అనుమతులు జారీ చేశారు.


