● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి సులభంగా అర్థం అయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని వెంకంపేట జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్‌లో భాగంగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో హిందీ శిక్షణ ఇస్తుండగా కలెక్టర్ బోధన విధానాన్ని పరిశీలించారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు సిరిసిల్ల గీతానగర్ బాలికల హైస్కూల్, ఇంగ్లిష్ టీచర్లకు వేములవాడలో, ప్రాథమిక స్థాయి ఎంఆర్‌పీలకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ అంశాల్లో ఎల్లారెడ్డిపేట జెడ్పీ హైస్కూల్‌లో శిక్షణ కొనసాగుతుంది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందించే ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. ప్రతీ విద్యార్థి తెలుగు, ఇంగ్లిష్, హిందీ పదాలు సులభంగా నేర్చుకునేలా బోధించాలన్నారు. బోధనలో టీఎల్‌ఎంలు వినియోగించి విద్యార్థులు ఆసక్తితో బడికి వచ్చేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో అమలు చేయాలని, మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా విద్యాధికారి మొండయ్య, తహసీల్దార్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన
సిరిసిల్లఅర్బన్: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోదాం నిర్మాణానికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మంగళవారం పెద్దూరు వద్ద ఇందిరా మహిళా శక్తి భవనం సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. ఎన్ని ఎకరాలు అందుబాటులో ఉందో ఆరా తీశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సీడబ్ల్యూసీ ఆర్‌ఎం విష్ణువర్ధన్, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, తహసీల్దార్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


