మాతృ సంస్థకు ‘రాజన్న’ ఉద్యోగులు యాదాద్రి బోర్డు ఏర్పాటుతో మారిన రాత యథాస్థానాలకు చేరిన సిబ్బంది పోస్టుల కోసం జోరుగా పైరవీలు
వేములవాడ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొత్త బోర్డు ఏర్పాటు కావడంతో కొంతకాలంగా వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అదృష్టం వరించింది. మాతృ సంస్థ అయిన యాదాద్రికి తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమం కావడంతో 17 మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారంతా వేములవాడ నుంచి రిలీవ్ అయి యథా స్థానాలకు చేరుకోవడంతో వారిలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది. అలాగే వేములవాడకు చెందిన 14 మంది ఉద్యోగులు తిరిగి తమ మాతృసంస్థ రాజన్న క్షేత్రానికి చేరుకోవడంతో వీళ్లూ సంబరాలు జరుపుకుంటున్నారు.
‘కీలక’ పోస్టుల కోసం పైరవీలు
మాతృ సంస్థకు చేరిన సిబ్బందిలో కొందరు కీలకమైన విభాగాల్లో పోస్టులు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రసాదాల విభాగం, ప్రధానాలయం, మేయిన్ గోదాం, వసతి గదుల నిర్వహణ, అన్నదానం వంటి కీలక పోస్టుల కోసం జోరుగా పైరవీలు నడుస్తున్నట్లు ఆలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఉన్నతాధికా రుల ద్వారా, రాజకీయ సిఫార్సులతో తమ కు అనుకూలమైన పోస్టింగ్‌లు సాధించుకునేందుకు కొందరు ఉద్యోగులు తెరవెనుక చక్రం తిప్పుతున్నా రు. ఈవో మాత్రం నిబంధనల ప్రకారం, పారదర్శకంగానే విధులు కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజన్న క్షేత్రంలో లోటు.. యాదాద్రిలో జోష్
వేములవాడ ఆలయంలో 17 మంది సిబ్బంది వెళ్లడంతో ఇక్కడ కొరత ఏర్పడగా, యాదాద్రిలో మాత్రం కొత్త బోర్డు రాకతో పాత సిబ్బందికి పూర్వవైభవం వచ్చినట్లయింది. మరో పది మంది ఉద్యోగులు మిగతా ఆలయాల నుంచి వేములవాడకు చేరుకోవాల్సి ఉంది. ఇందులో కొండగట్టు నుంచి 8 మంది, బాసర నుంచి ఇద్దరు, భద్రాచలం నుంచి ఒకరు రావాల్సి ఉంది. ఇక ఇంజినీరింగ్ విభాగంలో ఈఈ, ఏఈ తప్ప మిగతా వారంతా రిటైర్మెంట్, బదిలీపై వెళ్లడంతో ఆశాఖ పూర్తిగా ఖాళీ అయ్యింది. దీంతో పోచమ్మ ఆలయ అభివృద్ధి, భక్తుల కనీస సౌకర్యాలకు చేపట్టే పనులు, ఆషాఢమాసంలో చేపట్టే ప్యాచ్ వర్క్‌లకు ఇబ్బందిగా మారనుంది. దేవా దాయశాఖ, పాలకులు కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఈవో ప్రత్యేక నజర్
ఎవరెవరికి ఏ విభాగాలు కేటాయించాలనే దానిపై ఈవో గత అనుభవాలు, ఉద్యోగుల పనితీరుపై ముందే ఒక స్పష్టమైన నివేదిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పైరవీలకు తావివ్వకుండా, అర్హత ఆధారంగా పోస్టింగ్‌లు ఉంటాయని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఉద్యోగుల పోస్టింగ్‌పై ఈవో ప్రత్యేక నజర్ వేశారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
16 మంది ఉద్యోగులకు పోస్టింగ్
వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్న ఉద్యోగులతోపాటు ఇక్కడే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పలు శాఖలు కేటాయిస్తూ ఈవో రమాదేవి మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. యాదాద్రి నుంచి రాజాద్రికి వచ్చిన ఉద్యోగులను కలుపుకుని మొత్తం 16 మందికి శాఖలు కేటాయించారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.


