ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం మిషన్ చోరీ వాహనంలో వచ్చి లాక్కెళ్లిన దుండగులు రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తం పర్యవేక్షిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం సెంటర్‌లోని మిషన్ చోరీకి గురవడంతో మండల కేంద్రం ఉలిక్కిపడింది. కామారెడ్డి– సిరిసిల్ల ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎం సెంటర్లోని మిషన్‌ను దొంగలు గొలుసులతో లాక్కెళ్లిన సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండాకాలంలో దొంగల బెడద సాధారణంగా ఉంటుంది. కానీ ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల పనేనని చర్చ సాగుతోంది. ఈ సంఘటనను ఎస్పీ మహేశ్ బీ గీతే సీరియస్‌గా తీసుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి 12 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.
సీసీ పుటేజీల ఆధారంగా..
ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు ఎటువైపు పారిపోయారనే దానిపై పోలీసులు సీసీ పుటేజీల ఆదారంగా ముందుకెళ్తున్నారు. పోలీస్ జాగిలాలు ఎల్లారెడ్డిపేట నుంచి రాగట్లపల్లి వరకు వెళ్లి ఆగిపోయాయి. దొంగలు మిషన్ డబ్బాలను పడేసిన అక్కపల్లి శివారులోని బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయ సమీపం వరకూ వెళ్లాయి. అంతకంటే ముందుకు జాగిలాలు వెళ్లలేకపోతున్నాయి.
రెండు సంఘటనలు వీరి పనేనా ?
ఎల్లారెడ్డిపేటలో ఏటీఎంను మిషన్‌ను అపహరించుకెళ్లిన దొంగలు వెళ్తూ.. వెళ్తూ వీర్నపల్లి మండలం బంజరులో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఈ రెండు సంఘటనలు ఒకేరోజు కొద్ది సమయంం తేడాలోనే జరగడంతో పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
వచ్చింది ఎంత మంది?
ఏటీఎం దొంగతనానికి వచ్చింది ఎంతమంది అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. మిషన్ సుమారు క్వింటాల్ బరువు ఉంటుందంటున్నారు. నలుగురు దొంగల ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందనే అనుమానాలున్నాయి. మిషన్‌లో ఒక రోజు ముందే అందులో రూ.6.06లక్షలు ఉంచినట్లు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ముందుగానే దొంగలు రేక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.
పాత నేరస్తుల విచారణ
పలు దొంగతనాలలో గతంలో పట్టుబడ్డ అంతర్‌రాష్ట్ర దొంగలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కొత్తగా దొంగల ముఠాలు ఏమైనా ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయా.. అసలు ఈ ఘటనకు పాల్పడింది.. అంతర్‌రాష్ట్ర లేక అంత జిల్లానా, లేక స్థానిక దొంగలా పనేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్వయంగా ఎస్పీ మహేశ్ బీ గీతే ఈ దొంగతనం సంఘటనపై విచారణ చేస్తున్నారు.
సరిహద్దుల్లో అప్రమత్తం
ఏటీఎం మిషన్ డబ్బాను అక్కపల్లి శివారులో వదిలేసి అక్కడి నుంచి ఎటువైపు వెళ్లి ఉంటారనే దానిపై పోలీసులు ప్రధాన దృష్టి సారించారు. వీర్నపల్లి–సిరికొండ మీదుగా నిజామాబాద్ వైపు వెళ్లి ఉంటారా.. కోనరావుపేట నుంచి జగిత్యాల వైపు వెళ్లి ఉంటారా.. కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ వైపు పారిపోయి ఉంటారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే అన్ని జిల్లాల సరిహద్దుల్లోని చెక్ పోస్ట్‌ల వద్ద ప్రత్యేక పోలీసులను నియమించి వాహనాల తనిఖీతో పాటు అనుమానిత వ్యక్తులను పట్టుకొని విచారిస్తున్నారు.


