ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి
సిరిసిల్లటౌన్: మహాత్మ జ్యోతిబా పూలే జీవితం అన్ని తరాలకు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆనాడు సమాజంలో జరుగుతున్న వివక్షకి వ్యతిరేకంగా పూలే పోరాడారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తన వద్ద విద్యాశాఖను ఉంచుకొని పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రంలోని రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని తెలిపారు. నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను విడుదల చేసిందన్నారు. ఇందిరమ్మ చీరల ఆర్డర్లను మన ప్రాంతంలో ఇవ్వడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమం చేసిన వారికి అండగ ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షు డు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, కాముని వనిత పాల్గొన్నారు.
నివాళి అర్పించిన కలెక్టర్
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చిత్రపటానికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.


