
ఓపెన్‌జిమ్స్‌పై నిర్లక్ష్యం
ఇది సిరిసిల్లలోని మెహెర్‌నగర్‌లో స్మార్ట్ ఓపెన్‌జిమ్. ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యంతో బల్దియా ఆధ్వర్యంలో రూ.15లక్షలతో ఏడున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పొద్దున, సాయంత్రం ప్రజలు నిత్యం ఇక్కడకు వచ్చి ఆరోగ్యం కోసం ఓపెన్‌జిమ్‌లో పరికరాలతో కసరత్తు చేస్తుంటారు. ఏడాదిన్నర కాలంగా ఈ పరికరాల నిర్వహణను మున్సిపల్ పట్టించుకోవడం లేదు. పరికరాల విడిభాగాలు పాడై పనికిరాకుండా పోయాయి.
సర్ధాపూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పిచ్చి మొక్కల్లో జిమ్
నెహ్రూపార్క్ ఎదుట పాడయిన ఓపెన్‌జిమ్
సిరిసిల్లటౌన్: ఆరోగ్య సిరిసిల్లపై బల్దియా అశ్రద్ధ వహిస్తుంది. గతంలో పట్టణం చుట్టుముట్టూ పార్కుల్లో పరుచుకున్న ఆహ్లాదంతోపాటు ప్రజారోగ్య రీత్య ఓపెన్‌జిమ్స్‌ను ఏర్పాటు చేశారు. కొద్దికాలంగా ఈ ఓపెన్‌జిమ్స్ నిర్వహణ లోపంతో పరికరాలు తుప్పుబట్టి.. పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికే పరికరాల మరమ్మతు కోసం స్థానికులు ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టింపు కరువైంది.
ప్రజా ఆరోగ్యంపై అశ్రద్ధ
ఆరోగ్య సిరిసిల్లలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్స్ అలంకారప్రాయంగా మారాయి. సుమారు ఏడున్నరేళ్ల క్రితం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఆధ్వర్యంలో ‘వరల్డ్‌బ్యాంకు’ ప్రాజెక్టు ద్వారా స్మార్ట్ ఓపెన్‌జిమ్స్ ఏర్పాటు చేశారు. స్థానిక ఇందిరాపార్కు, శాంతినగర్, గణేశ్‌నగర్‌లో ఒక్కోటి రూ.15లక్షలు వెచ్చించి రూ.45లక్షలతో మూడు చోట్ల ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంగా మున్సిపల్ ఆధ్వర్యంలో విలీన గ్రామాలను కూడా కలుపుకుని మొత్తంగా 23 చోట్ల ఔట్‌డోర్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు వందలాది సంఖ్యలో పెద్దలు, చిన్నలు, మహిళలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేవారు. పరికరాలు తుప్పుబట్టి పోవడం, మరమ్మతుకు నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సామాజిక బాధ్యతపై నిర్లిప్తత
ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యం అందని ద్రాక్షగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిలో ముందున్న సిరిసిల్ల బల్దియా అప్పట్లో స్మార్ట్ సిటీలో భాగంగా సామాజిక బాధ్యతగా ఓపెన్‌జిమ్స్, అన్నపూర్ణ క్యాంటీన్, క్లాత్‌బ్యాంకు, చారిటీవాల్ ఏర్పాటు చేసింది. సీడీఎంఏ, మున్సిపల్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానం, రగుడు, శాంతినగర్, నెహ్రూనగర్, కార్గిల్‌లేక్, పెద్దూరు, చిన్నబోనాల, రాజీవ్‌నగర్, పెద్దబోనాల, జేపీ నగర్ పార్క్, పద్మనగర్, బీవై నగర్, సుందరయ్యనగర్, వెంకంపేట, నర్సింగ్‌కాలేజీ ప్రాంతం, నెహ్రూపార్కు, డబుల్‌బెడ్రూం కాంప్లెక్సు, వెంకట్రావునగర్ పార్కు, సాయినగర్ ప్రాంతాల్లో ఓపెన్‌జిమ్స్ ఉన్నాయి.
రూ.కోట్లు.. నిర్లక్ష్యంతో పాట్లు
ఓపెన్ జిమ్స్‌పై బల్దియా నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిరిసిల్లలో ప్రజా ఆరోగ్యం కోసం రూ.1.75కోట్లు ఖర్చు చేయగా బల్దియా వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పరికరాలు విరిగిపోవడం, ఫ్లోరింగ్ పెచ్చులూడిపోతున్నాయి. నిత్యం వాకర్స్, వ్యాయామానికి వచ్చేవారు ఓపెన్‌జిమ్స్ పనికిరాకుండా ఉండటాన్ని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు.

ఓపెన్‌జిమ్స్‌పై నిర్లక్ష్యం

ఓపెన్‌జిమ్స్‌పై నిర్లక్ష్యం