
‘త్రిఫ్ట్’లో బోగస్ ఏరివేత
సిరిసిల్ల: వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాల్లో బోగస్ కార్మికులను ఏరివేసి నిజమైన నేతన్నలకు అండగా నిలవాలనే దిశగా చేనేత, జౌళిశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. నేతకార్మికులకు పొదుపును అలవాటు చేసి, వారికి భవిష్యత్‌పై నమ్మకం కలిగించే లక్ష్యంతో ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో కార్మికులు ప్రతీ నెల వారి వేతనంలో 8శాతం మేరకు జమ చేసుకుంటే.. అంతేమొత్తంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 24 నెలల తర్వాత వడ్డీతో సహా పొదుపు డబ్బులు నేతకార్మికుల చేతికి అందుతాయి. ఈ పథకంలో గతంలో కొందరు పనిచేయని ఆసాములు, స్థానికేతరులు, మరమగ్గాల్లో శ్రమించని వారు చేరి ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాంచాల మధ్య శ్రమించే కార్మికులు, అనుబంధ రంగాల్లో పనిచేసే నేతకార్మికులకే వర్తించేలా క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు.
ఐదు బృందాలతో సర్వే
సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, చంద్రంపేట, జ్యోతినగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో చేనేత జౌళిశాఖ అధికారులు ఐదు బృందాల ద్వారా సర్వే చేస్తున్నారు. త్రిఫ్ట్ పథకానికి దరఖాస్తు చేసుకున్న కార్మికులు నిజంగానే పని చేస్తున్నారా.. లేదా.. అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు సేకరిస్తున్నారు. చేనేత, జౌళిశాఖ అధికారులతోపాటు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు.
త్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరిన నేతకార్మికులపై క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నాం. అర్హులైన కార్మికులకు పొదుపు పథకంలో అవకాశం లభిస్తుంది. బోగస్ నేతకార్మికుల ను చేర్చుకునే అవకాశం లేదు. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ

‘త్రిఫ్ట్’లో బోగస్ ఏరివేత