
గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో
వేములవాడ: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకో వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న ఆలయ చైర్మన్ చాంబర్‌లో గురువారం గణేశ్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నట్లు తెలిపారు. నిమజ్జన సమయంలో ఇబ్బందులు రాకుండా అవసరమైన పెద్ద క్రేన్లు ముందుగానే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అదనపు ఏర్పాట్లు చేయాలన్నారు. నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా డీజే, క్రాకర్స్‌కు అనుమతి ఇవ్వవద్దన్నారు. నిమజ్జనం పాయింట్ వద్ద అవసరమైన మేర గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ పాయింట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారులతో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
రోడ్డు మరమ్మతు చేపట్టాలి : కలెక్టర్
నిమజ్జనం రూట్‌లో అవసరమైన మేరకు రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. నిమజ్జనం పాయింట్ల వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. లైటింగ్, బారీకేడ్లు, మెడికల్ క్యాంపు, సాంస్కృతిక కార్యక్రమాలు, మొబైల్ టాయిలెట్ సదుపాయాలను కల్పించాలన్నారు. నిమజ్జనం రోజున వైన్స్, బెల్టుషాపులు మూసివేయాలని ఆదేశించారు. ప్రతీ వినాయక విగ్రహానికి టోకెన్ అందించాలని తెలిపారు.
భారీ బందోబస్తు : ఎస్పీ
నిమజ్జనం సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. పెద్ద విగ్రహాల తరలింపు రూట్‌లను ముందుగా పరిశీలించి, ఆ మార్గంలో ఎలాంటి కేబుల్స్ అడ్డురాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం విప్‌తో కలిసి అధికారుల బృందం గుడి చెరువును పరిశీలించారు. ఆలయ ఈవో రాధాబాయి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా ఫైర్ సర్వీసెస్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఆర్‌అండ్‌బీ, సెస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.