
‘ఇందిరమ్మ’ ముందుకు..
చిత్రంలో స్లాబ్ పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమైన ఇల్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అడవిసోమన్‌పల్లి గ్రామంలోనిది. గ్రామంలో 348 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. 192 నివాసాలు బెసెమ్మెంట్ లెవల్, 85 గోడలు, 51స్లాబ్, 20 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధం అయ్యాయి. మంచిరోజు చూసి మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సాక్షి, పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. అర్హుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటి నుంచి ఇటు ప్రజాప్రతి నిధులు, అటు అధికారులు పర్యవేక్షిస్తూ ఇళ్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నవారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. బేస్‌మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్‌కు రూ.2లక్షలు గృహప్రవేశ సమయంలో రూ.లక్షను మంజూరు చేస్తూ, లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా, హౌసింగ్ ఆఫీసులుగా వినియోగించనున్నారు.
ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో నిర్మించుకోలేక పోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా, త్వరితగతిన బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 470 మంది లబ్ధిదారులకు సుమారు రూ.4.7కోట్ల రుణాలు అందించారు.
ఇందిరమ్మ ఇల్లును 400 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించుకోవాలి. లేకుంటే జీపీఎస్ యాప్‌లో నమోదు కాదు. బిల్లుల చెల్లింపు జరగదు. ప్రతివారం ఇంటి నిర్మాణ పనులను జీపీఎస్ ద్వారా చిత్రీకరించి, ప్రగతిని బట్టి ఏదేనీ సోమవారం చెల్లింపులు చేస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్‌మెంట్‌తో పాటు ఇతర దశల వారీగా పనులు పూర్తి కాగానే సంబంధిత అధికారులు వాటి ఫొటోలు తీసి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. బేస్‌మెంట్‌స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తున్నారు. నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా వారంలో రెండు రోజులు ఇసుక, మట్టి కోసం అనుమతులు మంజూరు చేస్తున్నారు.
బ్యాంకుల విలీనం, వేరువేరు ఖాతాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలతో బిల్లుల మంజూరులో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలో బిల్లు జమచేస్తోంది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ఆధారంగా బిల్లు మంజూరు చేస్తున్నారు.
ఈ చిత్రంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటి రెదుట కనిపిస్తున్న మహిళ సీహెచ్ స్వరూప. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట. స్వరూప ఇంటి నిర్మాణానికి మార్చిలో ఎమ్మెల్యే విజయరమణరావు చేతుల మీదుగా ముగ్గు పోశారు. గ్రామంలో ఈమెతో పాటు మరో ఇద్దరు నిర్మాణాలు పూర్తిచేసుకుని, గృహప్రవేశానికి సిద్ధమవ్వగా, ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పటికే రూ.4లక్షల చొప్పున బిల్లు జమైంది. గృహప్రవేశం సందర్భంగా మరో రూ.లక్ష పడనుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం చేయనున్నారు.

‘ఇందిరమ్మ’ ముందుకు..

‘ఇందిరమ్మ’ ముందుకు..