
ఖాళీ స్థలం.. రోగాల నిలయం
● దోమలు పెరిగి.. పందులు తిరిగి ● కంపుకొడుతున్న కాలనీలు ● పల్లెల్లో పడకేసిన పారిశుధ్య నిర్వహణ ● పట్టించుకోని అధికారులు
సిరిసిల్లఅర్బన్/వీర్నపల్లి(సిరిసిల్ల): ఖాళీ స్థలాలు రోగాలకు నిలయాలుగా మారాయి. మురుగునీరు నిలిచి.. పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారాయి. దీంతో చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. సిరిసిల్ల పట్టణంతోపాటు, శివారుకాలనీలు చంద్రంపేట, జ్యోతినగర్, కొత్తబస్టాండ్, శాంతినగర్, రాజీవ్‌నగర్, ముష్టిపల్లి, బోనాల, పెద్దూరు, మారుమూల పల్లెల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.
కంపుకొడుతున్న పల్లె, పట్టణం
సిరిసిల్ల పట్టణంలో చాలా వార్డుల్లో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఖాళీ స్థలాల్లోకి మురుగునీరు చేరి దుర్వాసన వస్తోంది. ప్రధానంగా పట్టణంలోని శివారు గ్రామాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వీర్నపల్లి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు మురుగునీటి నిలయాలుగా మారాయి. ఆ స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు అలాగే వదిలేయడంతో మురుగునీరు నిలిచి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ముస్లింకాలనీని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఎప్పుడూ మురికినీరు నిలిచి ఉంటుంది. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి మొరం పోయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం, నూతన బస్‌స్టాండ్ ప్రాంతంలోని ఖాళీ స్థలాల్లో మురికినీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, జెడ్పీ హైస్కూల్ ప్రాంతం. ప్రతీ ఆదివారం నిర్వహించే వారసంత సమీపంలోని ఖాళీ స్థలం. ఇక్కడ వాటర్‌ట్యాంకర్ వద్ద నీళ్లు నిలిచి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. బడికి వచ్చే విద్యార్థులు, వారసంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు దుర్వాసన భరించ లేకపోతున్నారు.
ఇది వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రధాన డ్రెయినేజీ మురికినీరు. పాత గ్రామపంచాయతీ వెనకాల ఖాళీ స్థలంలో నిలువ ఉన్న మురుగునీరు వెళ్లే మార్గం లేక దోమలకు నిలయంగా మారింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు.

ఖాళీ స్థలం.. రోగాల నిలయం

ఖాళీ స్థలం.. రోగాల నిలయం

ఖాళీ స్థలం.. రోగాల నిలయం