
రాజీమార్గం కోసం ప్రోత్సహించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి రాజీమార్గాన్ని ప్రోత్సహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు. జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు, అధికారులతో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. బీమా, రోడ్డు ప్రమాదాలు, గృహహింస, అదనపు వరకట్న వేధింపులు, విడాకులు, భరణం, గార్డియన్‌షిప్, ఇతర సివిల్, క్రిమినల్ కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వి.పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రవీణ్, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అదాలత్‌లో కేసులు సత్వర పరిష్కారం
లోక్ అదాలత్‌లో కేసులు సత్వర పరిష్కారమవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి రాధికా జైశ్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల డిపోలో మేనేజర్ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. సెప్టెంబర్ 13న జిల్లా కోర్ట్‌లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.