చెరుకు రైతుకు రవాణా భారం | - | Sakshi
Sakshi News home page

చెరుకు రైతుకు రవాణా భారం

Aug 19 2025 12:07 PM | Updated on Aug 19 2025 12:07 PM

చెరుక

చెరుకు రైతుకు రవాణా భారం

ప్రభుత్వం భరించాలి మమకారం చంపుకోలేకే..

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఏకై క ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని రైతులు ఏళ్ల తరబడి కోరుతున్నా.. పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా.. చక్కెర ఫ్యాక్టరీ మాత్రం ప్రారంభం కావడం లేదన్నది ఇక్కడి రైతుల వేదన. దీంతో చెరుకు పంటపై మమకారం చంపుకోలేక.. రైతులు ఇతర జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ చెరుకు ఫ్యాక్టరీతో ఒప్పందాలు చేసుకొని చెరుకును సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్‌ చక్కెర ఫ్యాక్టరీ సైతం చెరుకు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించలేక నిర్లక్ష్యం చూపుతోంది. ఈ నేపథ్యంలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని, అప్పటివరకు చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలని చెరుకు రైతులు ఇటీవల జగిత్యాలకు వచ్చిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, వివేక్‌ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు.

1,500 ఎకరాల్లో సాగు

జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో.. ప్రస్తుతం చెరుకు పంటను దాదాపు 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒకప్పుడు 10వేల ఎకరాలకు పైగా చెరుకు పంట ఉన్నా.. ఫ్యాక్టరీ మూసేయడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. గతంలో జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ ప్రభుత్వానిది కావడంతో.. పంట సాగు చేసే రైతులకు ఎరువులు, విత్తనం, కటింగ్‌, రవాణా వంటి వాటిపై ప్రోత్సాహకాలు అందించేది. ఇప్పుడు జిల్లాలో చెరుకు సాగు చేసే రైతులు కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ షుగర్‌ ప్యాక్టరీకి చెరుకును పంపిస్తుండడంతో.. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా, లేనిపోని నిబంధనలు పెట్టి జిల్లా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

రవాణా భారం..

ప్రైవేట్‌ ఫ్యాక్టరీ ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోయినా.. చెరుకు పంటపై ఆసక్తితో చెరుకును సాగు చేసిన రైతులకు రవాణా భారం పెద్ద సమస్యగా మారింది. జిల్లా నుంచి కామారెడ్డి చక్కెర ఫ్యాక్టరీ కనీసం 150 కి.మీ. వరకు ఉంటుంది. గతంలో ముత్యంపేట ఫ్యాక్టరీ వారు 15 కి.మీ. వ్యాసార్థంలో రవాణా భారం వేసేవారు కాదు. 15 కి.మీ. తర్వాత ఉన్న రైతులు ఎంతో కొంత మొత్తం చెల్లించేవారు. ఇప్పుడు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చెరుకు సాగు చేసేవారు కామారెడ్డికి లారీల్లో చెరుకు తరలించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రైతులు చెరుకును కామారెడ్డి ప్రైవేట్‌ ఫ్యాక్టరీకి తరలించేందుకు టన్నుకు దాదాపు రూ.700 వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలా దాదాపు జిల్లా చెరుకు రైతులు రవాణా పేరిట రూ.4.50కోట్ల వరకు నష్టపోతున్నారు.

దిగుబడులు ఘనం.. వచ్చేది స్వల్పం

ఇక్కడి చెరుకు రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం చెరుకు టన్ను ధర రూ.3,470 వరకు ఉండగా, అందులో చెరుకు కటింగ్‌ కోసం కూలీలకు టన్నుకు రూ.860, రవాణా కోసం టన్నుకు రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పంటకు అవసరమైన రసాయన ఎరువులు, కలుపు వంటి వాటి కోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెరుకు తరలించడం వల్ల రైతులకు పెద్దగా మిగిలింది ఏమీ లేదు.

చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలి. చెరుకు పండిస్తే మాకు ఆదాయం కాకుండా ఖర్చులు మిగులుతున్నాయి. త్వరగా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని ప్రారంభించి చెరుకు రైతులకు అండగా ఉండాలి.

– మామిడి మహేందర్‌రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి

చెరుకు పంటపై మమకారం చంపుకోలేక సాగు చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోవడంతో కామారెడ్డికి తరలించాల్సి వస్తోంది. రవాణా భారం, కటింగ్‌ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.

– పీసు రాజేందర్‌రెడ్డి, మూడుబొమ్మల మేడిపల్లి, మెట్‌పల్లి

ఫ్యాక్టరీ ప్రారంభం కాక అదనపు ఖర్చులు

టన్నుకు రూ.700 వరకు భారం

ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులకు విన్నపాలు

చెరుకు రైతుకు రవాణా భారం 1
1/3

చెరుకు రైతుకు రవాణా భారం

చెరుకు రైతుకు రవాణా భారం 2
2/3

చెరుకు రైతుకు రవాణా భారం

చెరుకు రైతుకు రవాణా భారం 3
3/3

చెరుకు రైతుకు రవాణా భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement