● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత
వీర్నపల్లి(సిరిసిల్ల): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే డెంగీ వ్యాధిని నివారించగలమని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో శుక్రవారం డెంగీపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శరీరంపై దద్దులు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. పనికిరాని పాత్రలు, పాతటైర్లు, పగిలిపోయిన బకెట్లు ఉంటే బయట పడేయాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాలు డ్రై డేగా పాటించాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వైద్యులు అంజలి, ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, సారియా అంజు, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్‌ఈవో లింగం, ఎస్‌యూవో మోహన్, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు.
రైతుబజార్‌లో వసతులు కల్పిస్తాం
● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌లో వసతులు కల్పిస్తామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని మోడల్ రైతుమార్కెట్‌ను శుక్రవారం సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుబజార్ ఇన్ని రోజులు మున్సిపల్‌శాఖ నిర్వహణలో ఉండేదని, రెండు రోజుల క్రితమే వ్యవసాయశాఖ నిర్వహణ బాధ్యతలు తీసుకుందని తెలిపారు. రైతుబజార్‌లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యంపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన దుకాణాల్లోనే కూరగాయలు విక్రయించుకోవాలని, రోడ్డుపై విక్రయించొద్దని సూచించారు. ఏఎంసీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఖాజా, ఆడెపు జగన్ పాల్గొన్నారు.
కార్మికులు బెనిఫిట్స్ కోల్పోతున్నారు
సిరిసిల్లటౌన్: జిల్లా కార్మికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో లేబర్‌కార్డులు లేక కార్మికులు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కోల్పోతున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల లోని కార్మికభవన్‌లో శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సమస్యలపై మాట్లాడారు. కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు, డెలివరీకి రూ.50వేలు, పెండ్లికి రూ.లక్ష ఇవ్వాలని కోరారు. హెల్త్ చెకప్ పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని కోరారు. నాయకులు అజ్జ వేణు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
వర్షానికి కూలిన ఇల్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో మూడు రోజులుగా పలుమార్లు కురిసిన వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన రైతు మంద అశోక్ పెంకుటిల్లు శుక్రవారం కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో ఇల్లు ఉరుస్తోందని, వాన నీటికి గోడలు తడిసి పడిపోయిందని బాధిత రైతు అశోక్ తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి


