షెడ్లలోనే పంచాయతీలు
● పక్కా భవనాలు లేక ఇబ్బంది ● కొన్ని గ్రామాల్లో రేకులషెడ్లు ● మరికొన్ని గ్రామాల్లో అవి కూడా కరువు ● నిధులు లేక నిలిచిపోయిన నిర్మాణాలు
● ‘ఈ చిత్రం ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్‌పల్లితండా గ్రామపంచాయతీ కార్యాలయం. ఈ పంచాయతీ కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరుకాగా, స్థలం లేక నిధులు వెనక్కిపోయాయి. దీంతో అద్దె ఇంట్లోనే ఆఫీస్ కొనసాగుతుంది’.
● ‘ఈ ఫొటో ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాలోని పంచాయతీ భవనం. నిధులు లేక భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. రూ.20లక్షలు మంజూరుకాగా నిధులు సరిపోక చిన్నపాటి పనులు మిగిలిపోయాయి. పనుల కోసం సైతం మరిన్ని నిధులు కావాలని ప్రతిపాదనలు పంపారు’.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు అంటారు. కానీ, ఆ పల్లెకు గుండెకాయ అయిన గ్రామపంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు కరువయ్యాయి. నిధులు లేక కొన్ని గ్రామాల్లో అర్ధంతరంగా నిలిచిపోగా, మరికొన్ని గ్రామాల్లో గ్రామస్తులే రేకులషెడ్లు ఏర్పాటు చేసుకొని ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ తండా గ్రామాల్లో అద్దె ఇళ్లు తీసుకొని ఆఫీస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ నెల అద్దె చెల్లించడం కూడా జీపీలకు భారంగా మారుతుంది.
50 జీపీలకు భవనాలు కరువు
జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, 50 గ్రామాల్లో కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అద్దె ఇళ్లు, రేకులషెడ్లలో కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
● ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్‌పల్లితండా, జైసేవాలాల్‌తండా, గుంటపల్లిచెరువుతండాల్లో జీపీ భవనాలు లేవు.
● గంభీరావుపేట మండలంలో ఇటీవల ఏర్పడిన హీరాలాల్‌తండా గ్రామంలో పంచాయతీ కార్యాలయం లేదు.
● ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లి, గోపాల్‌పల్లిల్లో జీపీలకు పక్కా భవనాలు నిర్మించలేదు.
● రుద్రంగి మండలం గైదిగుట్టతండా, అడ్డబోర్‌తండా, వీరునితండా, సర్పంచ్‌తండా, చింతామణి, రూప్లా, బడితండాల్లో పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక అద్దె ఇళ్లు, ప్రభుత్వ బడులలో కొనసాగుతున్నాయి.


