చలితో అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలో చలితీవ్రత పెరిగింది. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో చలితో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకమంగా మారుతుంది. ఈనేపథ్యంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యం, తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజితతో మంగళవారం ‘సాక్షి’ ఫోన్‌ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్‌వో వివరంగా సమాధానాలు ఇస్తూ వారివారి సందేహాలను నివృత్తిచేశారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత ఉన్నారు.
● చలి తీవ్రతతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి. వాకింగ్ ఏ సమయంలో చేయాలి. గుండెపోట్లు ఎక్కువగా వస్తాయా.. వేడినీళ్లు తీసుకోవడం మంచిదేనా.?
– గుంటి పోచమల్లు, కరుణాకర్– బోయిన్‌పల్లి, తోట ధర్మేందర్– పోత్గల్, దినేశ్– సిరిసిల్ల, కూర్మాచలం సత్యనారాయణ– రుద్రంగి, గోగూరి ప్రభాకర్‌రెడ్డి– నారాయణపూర్
డీఎంహెచ్‌వో: చలిగాలుల ప్రభావంతో వైరల్ ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశముంది. శ్వాసకోశ, చర్మం పొడిబారడం, ముక్కుకారడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, బీపీ, షుగర్, గుండె, ఇతర వ్యాధిగ్రస్తులు ఉదయం ఎండ రాకుండా బయటకు వెళ్లొద్దు. సాయంత్రం 6గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి. చలికాలం సాధారణ వ్యక్తులు కూడా ఉదయం 6.30గంటల తర్వాత వాకింగ్ చేయడం మంచిది. చల్లని, వేడి నీళ్లు కాకుండా సాధారణ నీరు తాగాలి. వేడినీళ్లు తీసుకోవాల్సి వస్తే రెండు రోజులు తాగి వదిలేయాలి.
● జలుబు, దగ్గు విపరీతంగా ఉంటోంది. ఆర్‌ఎంపీ వద్ద మందులు తీసుకుంటున్నా తగ్గడం లేదు. మందులు చెప్పండి?
– సత్యనారాయణ– ఇల్లంతకుంట, చిట్టాపురం రాజారం– రుద్రంగి, దోశల శంకర్– గంభీరావుపేట
డీఎంహెచ్‌వో: చలికాలంలో వ్యాప్తి చెందే వైరస్‌తో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాటి ప్రభావంతోనే జ్వరాలు, జలుబు, దగ్గు, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ప్రజల్లో కనిపిస్తున్నాయి. జలుబు, దగ్గు కోసం లివోసెట్రిజిన్ మోంటెలుకాస్ట్ వాడండి. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో మందులు ఉన్నాయి. తాజా ఆహారం తీసుకుంటూ ఆరోగ్య నియమాలు పాటించాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తారు. ప్రతి వ్యాధికి అక్కడే కచ్చితమైన వైద్యం అందుతుంది.
● చలి ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు జాగ్రత్తలు వివరించండి. బాబుకు తుమ్ములు, గొంతునొప్పి తగ్గడం లేదు.?
– నులిగొండ శ్రీనివాస్– తంగళ్లపల్లి, కిరణ్, తమిశెట్టి అమర్–బోయిన్‌పల్లి, సతీష్– వీర్నపల్లి
డీఎంహెచ్‌వో: వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు తప్పకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఉన్ని వస్త్రాలు ధరించాలి. ఆహార నియమాలు పాటించాలి. చిన్నపిల్లలు మినహా అందరూ వ్యాయామం, నడక, యోగా అలవాటు చేసుకోవాలి. అస్తమా రోగులు చల్లని ఆహారం తీసుకోవద్దు. తీసుకుంటే ఊపిరితిత్తుల గదులు దగ్గరకు ముడుచుకుని శ్వాస ఇబ్బందులు ఏర్పడుతాయి. చిన్నపిల్లలకు జలుబు ఎక్వువగా ఉంటే నాసల్ డ్రాప్స్ ఒక్కొక్కటి చొప్పున మూడూ పూటలు వేయొచ్చు.
● సీజనల్ వ్యాధులపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటులో ఫీజులు నిలువరించాలి, పేరొకరిది, చికిత్స చేసే వైద్యులున్నారత్సే చర్యలు తీసుకుంటారు?
– మారవేని రంజిత్– రాచర్ల బొప్పాపూర్, గాంతుల మహేశ్– ముస్తాబాద్
డీఎంహెచ్‌వో: అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు, స్టాఫ్ వివరాలు, టెస్టుల ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశాం. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటివాటికి అనుమతులు ఇవ్వం. ఇక గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, రక్షణపై ఏఎన్‌ఎంలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. మందుల కొరత లేదు. ప్రజలంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవడం మంచిది.
● మా గ్రామంలో జలుబు, జ్వరాలు వస్తున్నాయి. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు చెప్పండి?
– ఏగుర్ల రాజు– వట్టెంల, తిరుపతి– వన్‌పల్లి, ఉపసర్పంచ్, అర్జన్– గంభీరావుపేట, వార్డుమెంబర్
డీఎంహెచ్‌వో: అన్నిగ్రామాల్లో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి సీజనల్ రోగాలపై అవగాహన కల్పిస్తూ మందులు ఇస్తున్నారు. ప్రజలంతా కచ్చితంగా దగ్గరిలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి. బీపీ, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు చలిలో తిరగొద్దు. చలి ప్రభావంతో రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తి హైపర్‌టెన్షన్, బ్రెయిన్‌స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండి, కూల్‌డ్రింక్స్, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. నీటిని తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
చలితో అప్రమత్తంగా ఉండాలి


