● ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు
సిరిసిల్ల: ప్రజల పక్షాన నిలుస్తూ, ప్రజా సమస్యలనే ఎజెండాగా.. నిత్యం వార్తలను, కథనాలను అందిస్తూ ‘సాక్షి’ ముందుకు సాగుతుంది. 2025లో జిల్లాలో అనేక కథనాలను పాఠకుల ముందుంచుతూ ముందుకు సాగింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భ్రూణహత్యలను ఎండగట్టింది. అక్రమంగా నాలా కబ్జాలను వెలికితీసింది. చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయాలను ఎలుగెత్తి చాటింది. సామాన్య గిరిజన రైతు విద్యుత్ బిల్లును కట్టకుంటే కరెంట్ కట్ చేస్తే అతడికి అండగా నిలిచింది. చీకటి ఇంటికి వెలుగులు వచ్చేలా ‘సాక్షి’ చొరవ చూపింది. ‘సెస్’ అధికారులు స్పందించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఇసుక అక్రమ రవాణా, పల్లెల్లో బెల్ట్‌షాపులు, అటవీ భూముల ఆక్రమణలు ఇలా.. సహజ వనరులను రక్షించేందుకు ‘సాక్షి’ నడుం కట్టింది. రైతులను చైతన్యవంతులను చేస్తూ, జిల్లా వ్యవసాయ అధికారులతో ‘ఫోన్ ఇన్’ నిర్వహించింది. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్లతో నేరుగా ప్రజలు మాట్లాడే అవకాశం కల్పిస్తూ, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్ ఇన్ కార్యక్రమాలను చేపట్టింది. సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యాధికారితో ఫోన్ ఇన్ చేపట్టింది. ఇలా ప్రజాహితమే లక్ష్యంగా ‘సాక్షి’ సాగిపోతుంది.


