అద్దంకి: భార్యపై భర్త ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన పట్టణంలోని కట్టకిందపాలెంలో శనివారం రాత్రి జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కట్టకిందపాలేనికి చెందిన బి.రమాదేవి, పేతురు భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భార్యపై అనుమానపడిన భర్త పేతురు ఇనుప రాడ్డుతో దాడి చేసి ఆమెను గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన తర్వాత తనే భార్యను వైద్యశాలకు తరలించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుడ్లూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురికి గాయాలైన సంఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై గుడ్లూరు మండలంలోని మోచర్ల–వీరేపల్లి గ్రామాల మధ్య శనివారం జరిగింది. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు బైకుపై ఉలవపాడు వచ్చి తిరిగి వెళ్తున్నారు. మోచర్ల–వీరేపల్లి మధ్యలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురూ గాయపడ్డారు. వారిని 108 వాహనంలో కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుడ్లూరు ఎస్సై వెంకట్రావు తెలిపారు.


