తాగునీటికి శాపం | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి శాపం

Aug 25 2026 1:39 AM | Updated on Aug 25 2026 1:39 AM

ఇసుకాసురుల పాపం..

అద్దంకి:

సుకాసురుల ధనదాహానికి గుండ్లకమ్మ నది నరకయాతన అనుభవిస్తోంది. గత రెండేళ్లుగా ఎలాంటి అధికారిక అనుమతులు లేకున్నా, వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీ అండదండలతో సాగిన ఇసుక దోపిడీతో నదీ గర్భం గుల్లయింది. పోక్లెయిన్లతో విచ్చలవిడిగా ఇసుకను తోడేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫలితంగా నదీ పరివాహక గ్రామాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.

తోడేశారు.. అడుగంటించారు!

బల్లికురవ, అద్దంకి మండలాలు, అద్దంకి పట్టణంలోని ప్రజలు, పశువుల దాహార్తిని తీర్చే ప్రధాన జీవనాడి గుండ్లకమ్మ నది. అయితే నదిలోని ఊట బావుల సమీపంలోనే ఇసుక మాఫియా భారీ యంత్రాలతో ఇసుకను కొల్లగొట్టింది. దీంతో బావుల్లోకి ఊట రాక పూర్తిగా ఎండిపోయాయి. తిమ్మాయపాలెంలో ఇప్పటికే రెండు బావుల్లో ఊట ఇంకిపోవడంతో కొత్తగా మరో బావి తవ్వించాల్సి వచ్చింది.

20 రోజులుగా దాహం కేకలు

గుండ్లకమ్మ నదిలోని ఊట బావుల్లో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో 5 వేల మందికి పైగా జనాభా కలిగిన బొమ్మనంపాడు, జార్లపాలెం, చెరువుకొమ్ముపాలెం తదితర గ్రామాల్లో 20 రోజులుగా చుక్క నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక జే.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని ప్రైవేటు ప్లాంట్‌ నుంచి బబుల్‌కు రూ.13 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

అద్దంకికి జల గండం!

దాదాపు 50 వేల జనాభా కలిగిన అద్దంకి పట్టణంతో పాటు పరిసర గ్రామాల తాగునీటి అవసరాలన్నీ గుండ్లకమ్మ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావానికి తోడు ఇసుక దోపిడీ తోడవడంతో పట్టణానికి నీరందించే బావులు ఎండిపోయాయి. గతంలో తవ్వి వదిలేసిన ఇతర గ్రామాల బావులకు మోటార్లు బిగించి, అతికష్టం మీద పట్టణంలోని మూడు ట్యాంకులకు నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు మనిషికి కేవలం 45 లీటర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మరో నెల రోజుల పాటు వర్షాలు కురవకపోతే పట్టణ ప్రజలకు తాగునీటి ముప్పు తప్పదు. మంత్రి చొరవ తీసుకుని నాగార్జునసాగర్‌ నీటిని గుండ్లకమ్మ నదికి విడుదల చేయిస్తే తప్ప ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గుండ్లకమ్మ గర్భాన్ని కొల్లగొట్టిన మాఫియా.. అడుగంటిన భూగర్భ జలాలు

వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీ

నాలుగు గ్రామాల్లో 20 రోజులుగా దాహం కేకలు.. బిందెడు నీటికి తంటాలు

రూ.13 వెచ్చించి బబుల్‌ నీళ్లు కొనుగోలు చేస్తున్న దుస్థితి

50 వేల జనాభా ఉన్న అద్దంకి పట్టణానికీ పొంచి ఉన్న ముప్పు

మామూళ్ల మత్తులో అధికారులు.. సాగర్‌ నీరు విడుదల చేయాలని జనం డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement