ఒంగోలు టౌన్: ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నకిలీ జర్నలిస్టుపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని రాంనగర్ మొదటి లైనులో గల ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ భవనంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న మాకినేని హరిబాబును ‘రిషి’ అనే గుర్తుతెలియని వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని బ్లాక్‌మెయిల్ చేశాడు. రూ.3 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తానని, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ వీరా నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు వన్‌టౌన్: మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి నష్టపరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన సాబోలు లక్ష్మయ్య 2023లో 16 ఏళ్ల మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి మార్కాపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) గొట్టిపాటి శ్రీనివాసరావు కోర్టులో వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి కె.శైలజ నిందితుడు సాబోలు లక్ష్మయ్యకు పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. కేసును విజయవంతంగా నడిపించిన అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి, స్పెషల్ పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజన్ సిబ్బందిని ఎస్పీ హర్షవర్థనరాజు ప్రత్యేకంగా అభినందించారు.
● కొమ్మాలపాడు వద్ద ప్రమాదం
సంతమాగులూరు (అద్దంకి): అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మండలంలోని కొమ్మాలపాడు గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన లారీ హైదరాబాద్ నుంచి ఇనుప సువ్వల (ఐరన్ రాడ్స్) లోడుతో తమిళనాడు వైపు వెళ్తోంది. కొమ్మాలపాడు సమీపానికి చేరుకోగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీలో డ్రైవర్ ఒక్కడే ఉండటం, అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గానీ, చిరునామా ఆధారాలు గానీ లభించకపోవడంతో మృతుడి పేరు, ఊరు వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వాహన యజమానులు లేదా బంధువులు సంప్రదిస్తేనే వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. లారీ నిండా భారీగా ఇనుప లోడు ఉండటంతో క్రేన్ల సాయంతో వాహనాన్ని పైకి లేపే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని, ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవడానికి భయపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా క్షయ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రకాశం జిల్లా వైద్యారోగ్య శాఖ, దిష సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నిర్మూలన ప్రచార రథాన్ని పాత రిమ్స్ వద్ద నుంచి సోమవారం ప్రారంభించారు. ఎల్‌ఈడి తెరతో కూడిన ఈ వాహనం ద్వారా గ్రామ గ్రామాన ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే ఉచిత చికిత్స చేయించుకోవాలని చెప్పారు. వ్యాధిగ్రస్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడితే రక్తపోటు, సుగర్ వ్యాధుల్లాగే జీవించవచ్చన్నారు. ఎయిడ్స్ నియంత్రణ కోసం జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ 1097కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌కే అమీన్, ఎస్.సాయి, బీవీ సాగర్, పీర్ బాషా, వెంకటేశ్వర్లు, స్వరూప్ కుమార్, సుజాత పాల్గొన్నారు.


