ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవన్‌లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 236 అర్జీలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పోటెత్తారు. ఒంగోలు కార్పొరేషన్ 18వ డివిజన్‌లోని చెరువుకొమ్ముపాలేనికి చెందిన మందా సుజాత తన సొంత స్థలంలో కొందరు ఆక్రమంగా దేవాలయం నిర్మించాలని చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశఆరు. కోప్పొలులో అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారని కమ్మపాలేనికి చెందిన దాచర్ల విజయ్‌కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొప్పోలు గ్రామ సర్వే నం.224/1, 226/1లోని ప్రభుత్వ భూమిలో ఢాకా రమణారెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు సాగుచేస్తున్నాడని, రొయ్యల అక్రమ పద్ధతిలో రొయ్యల చెరువుల సాగుకు ప్రభుత్వ పలు విభాగాలు అనుమతులు ఇచ్చాయని తెలిపారు. దీనిపై విచారించి అనుమతులు లేని చెరువులను తొలగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
సింగరాయకొండ: మండల కేంద్రంలోని చైతన్య నవోదయ పాఠశాలకు ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు సోమవారం నోటీసులు అందజేశారు. పాఠశాల వద్ద తౌశిక్ తల్లి మౌలాబి ఐదు రోజులుగా నిరరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం 1982 ప్రకారం పాఠశాల హాస్టల్ ఉన్న అనుమతులపై ఆధారాలు సమర్పించాలని స్కూల్ కరస్పాండెంట్ వాకా సుజాతకు నోటీసులు అందజేశారు. రెండు రోజుల్లోగా వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థి తల్లి మౌలాబి ఎంఈఓను కలిసి చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కొడుకు మృతికి కారణమైన వారిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, యధావిధిగా పాఠశాల హాస్టల్ నిర్వహిస్తున్నారని వివరించారు. పాఠశాలకు నోటీసులు అందజేశామని, రెండు రోజుల్లో వివరణ తీసుకొని తప్పనిసరిగా న్యాయం చేస్తామని తెలిపారు.


