పుట్టుక నుంచి చావు వరకు
● డీఎస్‌ఎంఎం జాతీయ నాయకుడు శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని, పుట్టుక నుంచి చావు వరకు దళితులు వివక్షను ఎదుర్కోవాల్సి రావడం అమానుషమని దళిత్ శోషన్ ముక్తి మంచ్ (డీఎస్‌ఎంఎం) జాతీయ నాయకుడు వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దళితవాడల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే మరో మూడు నెలల్లో చలో అమరావతి పేరుతో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతరా ప్రజా సంఘాలు చేపట్టిన సామాజిక శంఖరావం అధ్యయన యాత్రలో గుర్తించిన సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతో 80 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో పల్లెపల్లెలో , వాడవాడలో దళితుల పట్ల అంతులేని వివక్ష కొనసాగుతుందన్నారు. తాగే మంచినీటి నుంచి మొదలుకొని చనిపోయిన తరువాత పూడ్చిపెట్టే శ్మశాన వాటిక వరకు వివక్ష కనిపిస్తుందన్నారు. ఎస్సీల కోసం కేటాయించిన సబ్ ప్లాన్ కాగితాలకు మాత్రమే పరిమితమైందని, నిధుల వినియోగంపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కేర్‌లో 8 వేల కోట్ల రుపాయలను ఎక్కడ , ఎలా ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. అందులో దళితుల కోసం చేసిన ఖర్చు ఎంతో చెప్పాలన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీ 12 వందల కోట్ల రుపాయల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉందని, దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. దళిత విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలను విలీనం పేరుతో తొలగించి విద్యకు దూరం చేయడం దుర్మార్గమన్నారు. దళితులు నివసించే వాడల్లోని పాఠశాలల అభివృద్ది పనులను అర్దంతరంగా ఆపివేసిన ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. దళితుల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ నూజిళ్లపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు విషయంలో కాలయాపన చేస్తున్న అధికారులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే శక్తులు పారిశుద్య పనులు, కూలీ పనులు చేసి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే మాబు ప్రసంగిస్తూ...రెండేళ్ల చంద్రబాబు పాలనలో వందశాతం హామీలు నెరవేర్చిన ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారని, దళిత వాడల సమస్యలపై వారికి ఏ ర్యాంకులు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దళితుల పట్ల వివక్ష కొనసాగుతుంటే దేశం ఎలా ప్రగతి సాధిస్తుందని నిలదీశారు. ఈ ధర్నాలో నెరుసుల వెంకటేశ్వర్లు, జీవి కొండారెడ్డి, బాలకోటయ్య, బి.రఘురాం పాల్గొన్నారు.


