● పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో అప్రమత్తత అవసరం
● రెవెన్యూ సమీక్షలో సీసీఎల్‌ఏ ప్రత్యేక సీఎస్ జయలక్ష్మి
ఒంగోలు సబర్బన్: మండల రెవెన్యూ అధికారి, సర్వేయర్, వీఆర్వోలు కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రీ సర్వే సంబంధిత విషయాలను పరిష్కరించాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్(సీసీఎల్‌ఏ), స్పెషల్ సీఎస్ జయలక్ష్మి ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన ఆమె సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భూముల రీ– సర్వే, పట్టాదారుపాస్ పుస్తకాలు, పీజీఆర్‌ఎస్, ఐవీఆర్‌ఎస్ తదితర అంశాలపై లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కనీసం రోజుకి మూడు గంటలైనా రీసర్వేపై దృష్టి సారించాలన్నారు. 444, 445 జీఓలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న జీఓలపై, సర్కులర్లపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. భూములు రీ సర్వే ప్రక్రియలో కొత్త నిబంధనలు జోడించామని, వాటిని అనువదించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి లేదా జేసీ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీదారులతో కనీసం రెండుసార్లయినా మాట్లాడాల్సి ఉంటుందన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు కూడా అర్జీదారులతో మాట్లాడాలన్నారు. సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోనంకి కూర్మనాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 74 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు ఎస్పీ హర్షవర్ధన్‌రాజును కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరిధిలో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ వినతుల్లో ప్రధానంగా భూవివాదాలు, ఆర్థిక తగాదాలు, అత్తారింటి వేధింపులకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, గుడ్లూరు సీఐ రమేష్, ప్యానెల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, ‘మీకోసం’ ఎస్సై యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.


