మెగా డీఎస్సీపై తక్షణమే విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీపై తక్షణమే విచారణ చేపట్టాలి

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

మర్రిపూడి:

మెగా డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాల్లో పాలుపంచుకున్న రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం ఏపీజెన్‌ జెడ్‌ వార్‌ 3వ రోజు రిలే నిరాహార దీక్షను పార్టీ మండల అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైతుపక్షాన, బడుగు, బలహీనులు, ప్రజల పక్షాన, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు కదిలితే కేసులు, మైక్‌ పెడితే కేసు, ఫ్లెక్సీ కడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో ఇన్‌చార్జ్‌గా సమర్థుడైన ఆదిమూలపు సురేష్‌ను నియమించారని, ఆయనకు ప్రతిఒక్కరూ అండగా నిలిచి కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలకు తగిన బుద్ధిచెప్పాలన్నారు.

విద్యార్థులు, నిరుద్యోగ యువతను

మోసగించిన ప్రభుత్వం...

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ 2025 డీఎస్సీలో అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముందు తన పదవికి లోకేష్‌ రాజీనామా చేసి విచారణలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవాలని, ఆ తర్వాతే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా దొడ్డిదారిన ఉద్యోగాలిచ్చి వ్యాయామ ఉపాధ్యాయులకు మొండిచేయి చూపారన్నారు. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు కుదేలయ్యారని, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక చేసిన అప్పులు తీర్చలేక రైతన్న నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వంలో నాయకుల పరిస్థితి దోచుకో, దాచుకో తినుకో అన్న చందంగా ఉందన్నారు. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విద్యకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని చెప్పారు. పేద విద్యార్థుల కోసం విద్యాకానుక, వసతి దీవెనతో పాటు ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశ పెట్టడం, జగనన్న గోరుముద్ధ పేరుతో వారికి మేనమామలా అండగా ఉండి విద్యలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారన్నారు. 16 వేల ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారన్నారు. సచివాలయ ఉద్యోగాలు, 6 వేల పాఠశాలలకు రోస్టర్‌ విధానం తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. కూటమి ప్రభుత్వం రోస్టర్‌ విధానాన్ని రద్దు చేసిందన్నారు. పారదర్శకత లేదు.. కమిట్‌మెంట్‌ లేదు, ప్రశ్నపత్రాల్లో గోప్యత లేదు... పేపర్‌ లీకేజీలో అనేక సాక్ష్యాలు కనిపించినా ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. ఇసుక, గ్రావెల్‌, భూ దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. పేద ప్రజలకు ఇచ్చే రేషన్‌ బియ్యం పక్కదోవ పడుతున్నా అధికారులు పట్టించుకోరన్నారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాపై మైన్స్‌ అధికారులు 132 కేసులు బుక్‌ చేసి రూ.22 లక్షలు జరిమానా విధించారని, ఇసుకాసురులకు మంత్రి ఆశీస్సులు మెండుగా ఉండటంతో దోపిడీదారులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తుందని, తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసరావు, మసనం వెంకట్రావు, దుద్దుకుంట మల్లికార్జురెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మాకినేని సుధారాణి వెంకట్రావు, నాయకులు బోద రమణారెడ్డి, మారంరెడ్డి గంగాధర్‌రెడ్డి, పరిటాల సునీల్‌ కుమార్‌, వనిపెంట మల్లికార్జునరెడ్డి, మాకినేని హరీష్‌, పూనూరి సంజీవరెడ్డి, పెట్లూరి సత్యన్నారాయణ, చెరుకూరి భాస్కర్‌, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, బొల్లినేని నాగేశ్వరరావు, సామంతల శ్రీకాంత్‌రెడ్డి, మేదరమిట్ల భరత్‌ బెజవాడ వెంకటేశ్వర్లు, యనమల మాదవి, కోమట్ల వెంకారెడ్డి, కే మధు, జే వేణు, చుండూరి సురేష్‌, బత్తుల మనోహర్‌, శ్రీపతి విజయ్‌, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, చెన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొమ్ము సురేంద్ర, బీ శ్రీహరి, పంది కోటేశ్వరరావు, కముజుల బ్రహ్మారెడ్డి, ఏ కోటేశ్వరారవు, కే ఇజ్రాయిల్‌ ఉన్నారు.

మంత్రి పదవికి లోకేష్‌ రాజీనామా చేయాలి

రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్‌ సీపీ జిల్లా

అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ

చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, మాజీ మంత్రి సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement