డీఎస్సీ అక్రమాలపై పోరాటం యువత, నిరుద్యోగులకు అండగా ఉంటాం నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇవ్వాలి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7500 కోట్లు చెల్లించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
వంచనపై నిరసన హోరు..!
దగా డీఎస్సీతో నిరుద్యోగ యువతను మోసగించిన నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అక్రమాలపై విచారణ జరిపించాలని నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినదించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శనివారం కొనసాగాయి. – సాక్షి నెట్‌వర్క్
ఒంగోలు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రిలే దీక్షలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బూచేపల్లి విలేకర్లతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో దగా డీఎస్సీలో అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. ఆది నుంచి పాదర్శకత లోపించిందని విమర్శించారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు అమ్ముకునేందుకు, కూటమి నాయకుల పిల్లల కోసం స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి నాలుగు శాతానికి పెంచారని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగాన్ని సుమారు రూ.15 లక్షలకు అమ్ముకున్నారని విమర్శించారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. వేలాది ఉద్యోగాలు ఇచ్చామంటూ అసత్య ప్రకటనలు చేస్తున్నారని, అవి కేవలం పేపరుకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. విజయవాడ, విశాఖ జిల్లాల్లో ఉన్న అత్యంత విలువైన భూములు వివిధ కంపెనీలకు కారు చవగ్గా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే వారి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.7,500 కోట్లు బకాయిలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ నిధులను ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పొగాకు రైతులకు అన్యాయం..
మద్దతు ధరలు లభించక, కనీస పెట్టుబడులు రాక పుట్టెడు కష్టాల్లో మునిగిపోయిన పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచి పోరాడుతుందని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడి రావాలంటే క్వింటా రూ.20 వేలకు అమ్ముడు కావాలన్నారు. అది చేయకుండా కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. క్వింటా రూ.10 వేలు ఇస్తామని చెప్పడం ఎంతవరకూ న్యాయమని ఆయన ప్రశ్నించారు.
నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది..
డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడిచేయడం సరికాదని బూచేపల్లి అన్నారు. కనిగిరిలో ఆందోళన చేస్తున్న బలహీన వర్గాలకు చెందిన దద్దాల నారాయణను పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకుని వెళ్లారని, ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాలంటే చిన్నచూపని ఆయన ధ్వజమెత్తారు.
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. సంపద సృష్టిస్తానన్న ఆయన ఉన్న సంపదంతా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిలో కుమ్మరిస్తున్నాడన్నారు. రెండేళ్లలో ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకులు వై.వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.


