● డిపాజిటర్లను ముంచిన ఎన్‌టీఎల్ చైన్ లింక్ సంస్థ
● దర్శిలో 3 వేల మందికి పైగా బాధితులు
● రూ.21 వేలు కడితే రోజుకు రూ.750 ఇస్తామని చెప్పిన నిర్వాహకులు
● అలా నలుగురిని చేరిస్తే రూ.10 వేలు ఇస్తామని మోసం
● డబ్బులు పడటం లేదని
లబోదిబోమంటున్న బాధితులు
దర్శి: ఎన్‌టీఎల్ అనే చైన్‌లింక్ సంస్థ పేరుతో యాప్‌లో డిపాజిట్ల రూపంలో డబ్బులు కట్టించుకుని చేతులెత్తేసిన మోసం దర్శి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ బారిన పడిన బాధితులు సుమారు 3 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. తొలుత ఒక్కొక్కరు రూ.21 వేలు కడితే రోజుకు రూ.750 లెక్కన 2 సంవత్సరాలు చెల్లిస్తామని చెప్పి కస్టమర్‌ల వద్ద ఖాతాలు ఓపెన్ చేయించారు. ఇలా నలుగురిని చేర్పిస్తే చేర్పించిన వారికి రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. దీంతో కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని కొందరు అత్యాశకు పోయి తమ బంగారం సైతం బ్యాంకుల్లో పెట్టి తెచ్చి డబ్బులు వెచ్చించారు. ఎక్కువగా మహిళలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కొందరు వేలల్లో, మరి కొందరు రూ.లక్షల్లో కూడా డబ్బులు పెట్టి మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ చైన్‌లింక్ వ్యవహారంలో పది రోజులుగా డబ్బులు పెట్టిన వారికి తిరిగి తమ ఖాతాల్లో డబ్బులు పడటం లేదు. దీంతో ఆ సంస్థ వారిని ప్రశ్నిస్తుండటంతో ఖాతాల్లో డబ్బులు వేయాలంటే టాక్స్‌లు కట్టాలని, అందుకు మరి కొంత డబ్బులు చెల్లిస్తే వెంటనే ఖాతాల్లో మీకు రావాల్సిన డబ్బులు వస్తాయని నమ్మబలికారు. దీంతో వారి మాటలు నమ్మిన కొందరు మళ్లీ డబ్బులు వేశారు. అయినా డబ్బులు పడకపోవడంతో ప్రస్తుతం ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఎల్లా మాసన్ అనే ఆమె ఫారిన్ నంబర్లతో మెసేజ్‌లు పెడుతుందని, అంతకు మించి నిర్వాహకులు ఎవరూ ఫోన్‌లో మాట్లాడరని బాధితులు చెబుతున్నారు.
ఆశ చూపించి మోసం చేశారు...
మొదట కట్టిన వారికి ఖాతాల్లో చెప్పిన ప్రకారం డబ్బులు వేశారు. ఆ తరువాత వేయాల్సిన డబ్బులు నిదానంగా పంపుతూ ఎక్కువ డిపాజిట్లు సేకరించుకున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బులు పడ్డ వారి చేత సమావేశాల్లో లక్షల్లో లాభాలు వచ్చినట్లు వారి చేతే చెప్పించారు. దీంతో అత్యాశకు పోయి తమ ఇంట్లో వారికి కూడా తెలియకుండా భారీ మొత్తాల్లో డబ్బు పెట్టినట్లు సమాచారం. ఈవిధంగా రూ.కోట్లలో డబ్బు రాగానే ఇక ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా ఫోన్‌లు కూడా ఎత్తకుండా ఉడాయించారు. ఇక్కడ కనీసం ఒక కార్యాలయం కూడా లేకుండా ఇలా డబ్బులు ఎలా కట్టారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో చేరి తరువాత చేర్పించిన వాళ్లు సైతం లబోదిబోమంటున్నారు.


