కందుకూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలు, అవకతవకలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలు బహిర్గతమైన తర్వాత అభ్యర్థుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందన్నారు. కూటమి పాలనలో తమ బతుకులు ఆగమయ్యాయని నిరుద్యోగులు కన్నీరు పెడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు జరిగితే.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించిందని గుర్తుచేశారు. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడిని వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీబాబు వస్తే జాబు వస్తుందిశ్రీ అన్న మాయమాటలు నమ్మి యువత ఓట్లేస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ.. చంద్రబాబుకు సీఎం, పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం, లోకేశ్‌కు మంత్రి పదవులు మాత్రం దక్కాయని ఎద్దేవా చేశారు.
తోడల్లుడి కనుసన్నల్లో జూడో పోస్టులు
స్పోర్ట్స్ కోటా ముసుగులో డీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని బుర్రా ఆరోపించారు. జూడో క్రీడ కింద ఏకంగా 39 పోస్టులు కేటాయించారని, ఈ జూడో కేటగిరీకి లోకేశ్ స్వయానా తోడల్లుడు, విశాఖ ఎంపీ అయిన భరత్ అధ్యక్షుడు కావడంతోనే ఈ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. దీనిపై అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన యువతను నేడు రోడ్డెక్కేలా చేసిన పాపం చంద్రబాబుదేనని మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన అభ్యర్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. మెరిట్ జాబితాను పలుమార్లు మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. యువతకు న్యాయం జరిగే వరకు, మంత్రి లోకేశ్ రాజీనామా చేసి సీబీఐ విచారణకు ఆదేశించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, కందుకూరు, ఉలవపాడు, లింగసముద్రం మండలాల అధ్యక్షులు ఈదర రమేష్, నన్నం పోతురాజు, నోటి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సెక్రటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, బద్దిపూడి జయరావు, జిల్లా ఇంటెలెక్చువల్ అధ్యక్షుడు రావులకొల్లు బ్రహ్మానందం, రాష్ట్ర కల్చరల్ విభాగం అధికార ప్రతినిధి వల్లూరి కోటేశ్వరరావు, బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ పెయ్యల రమేష్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బిళ్లా రమణయ్య, కార్యదర్శి చీమల రాజా, పాశం కొండయ్య, యువజన విభాగం అధ్యక్షుడు మద్దసాని నవీన్‌యాదవ్, ఐటీ విభాగం అధ్యక్షుడు పాలవల్లి అమర్నాథ్‌రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఉచ్చులూరి రవీంద్ర, పల్నాటి చెన్నయ్య, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు చింతలపూడి సుధాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు తుళ్లూరి ఆదిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే
అక్రమ నియామకాలపై ప్రశ్నిస్తున్న డీఎస్సీ అభ్యుర్థులకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు
స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు
రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్


