ఉచిత పంటల బీమాకు మంగళం రైతన్నలపై అదనపు భారం రెండేళ్లుగా రైతులే బీమా ప్రీమియం చెల్లింపు ప్రీమియం కట్టినా..నష్టపోయిన పంటలకు దక్కని పరిహారం
బీమా లేదు..
రైతులను పట్టించుకోవడం లేదు
ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. గత ఏడాది అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా చీతిరాల కతువకు నీరు ఇష్టారాజ్యంగా వదలడంతో కతువ చుట్టు పక్కల పొలాలన్నీ నీటమునిగాయి. వరి, అరటి, పసుపు పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. పది రోజులుగా నీటిలో ఉండటంతో ఏ ఒక్క పంట చేతికందలేదు. అధికారులు వచ్చి పంట నమోదు చేసుకున్నారు. ఒక్కరికీ రూపాయి ఇవ్వలేదు.
– చిట్టే మల్లికార్జున, రైతు, సోమవారిపేట
ప్రభుత్వమే బీమా చెల్లించాలి
రైతులు పండించిన ఏ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదు. గత ఏడాదిలో వరుసగా వచ్చిన అకాల వర్షాలు, తుఫాన్‌లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ఏడాది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే కొంతమేర రైతులకు ఉపశమనం ఉంటుంది.
– ఆవుల శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్
బేస్తవారిపేట:
గత ప్రభుత్వం అమలుపరిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. అప్పులు చేసి పంటలు సాగు చేసే తమకు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ప్రోత్సాహం అందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండేళ్లలో కాస్తోకూస్తో పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాదైనా ఆదుకుంటుందన్న ఆశతో ఉన్న రైతులపై ప్రీమియం భారం కూడా వేయడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే రైతుకు ఇష్టమున్నా లేకున్నా తప్పనిసరిగా బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకర్లు రైతుకు ఇచ్చే రుణంలో ముందుగానే మినహాయించుకుని తీసుకుంటున్నారు. మాకు బీమా వద్దు, ప్రీమియం చెల్లించలేమన్నా ఊరుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. వరి పంటకు ప్రీమియం గణనీయంగా పెంచారు. గత ఏడాది ఎకరాకు రూ.80 ఉన్న ప్రీమియం ఈ ఏడాది ఏకంగా రూ.300లకు పెంచారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి పంట సాగు చేసే ప్రతి రైతు పంటల బీమా పొందాలంటే ప్రీమియం చెల్లించాల్సిందే.
దెబ్బతిన్న పంటలకు దక్కని పరిహారం:
● గత ఏడాదిలో మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుపాను వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి.
● 2024 డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఫెంగల్ తుఫాన్ ధాటికి జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. శనగ పంట 5,506 హెక్టార్లు, మినుము 1,902 హెక్టార్లు, పొగాకు 1,333 హెక్టార్ల, మినుములు 1902 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అప్పట్లో 7650 మంది రైతులు 25,540 ఎకరాల్లో హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
● 2024 అక్టోబర్ కురిసిన అధిక వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 13 నుంచి 21వ తేదీ వరకు ముసురుపట్టి భారీ వర్షాలు పడటంతో దాదాపు 24,700 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నేటికి రైతులకు ఒక్క రూపాయి ప్రభుత్వం విడుదల చేయలేదు.
సంకటంగా సాగు
మేదరమెట్ల: పత్తి పైరు మినహా మిగిలిన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన పథకం కింద నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొరిశపాడు మండలంలో ఏ సర్వే నంబరు పొలంలో ఏ పైరు వేస్తామనే కచ్చితమైన అంచనాకు సింహభాగం రైతులు రాలేదు. బ్యాంకు రుణాలు పొందేందుకు వెళ్లిన రైతులు కూడా తికమక పడుతున్నారు. రుణపరపతి పొందేటప్పుడు చెప్పిన సర్వే నంబరులో ప్రస్తుతం ఏ పంట వేస్తారనేది నమోదు చేయాలి. అలా పంట పేరు నమోదు చేయాలంటే వర్షాలు ఎప్పుడు సంపూర్ణంగా పడతాయో తెలియని పరిస్థితి. ఒక వేళ రుణం పొందే సర్వే నంబరులో ప్రస్తుతం ఒక పంట పేరు రాసి, రేపు మరో పంట సాగు చేస్తే ... ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే అప్పుడు పరిహారానికి అర్హత ఉండదని బ్యాంకర్లు రైతులకు చెప్తున్నారు. ఇదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట పేరు నమోదు చేసుకునేందుకు కూడా రైతులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. తక్కువ నీటి వసతితో ఫలసాయం ఇచ్చే అపరాలను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించి అంతటితో తమ పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది జూలై మాసాంతానికి కురిసిన వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి కురిసిన వర్షపాతం నామమాత్రమే. వ్యవసాయశాఖ అధికారుల గణాంకాల ప్రకారం జూలై మాసాంతానికి 98.5 మీ.మీ వర్షపాతం నమోదు కావాలి. అయితే మాసాంతానికి కేవలం 4.2 మీ.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో సాగు సంకటంగా తయారైంది. ఈ క్రమంలో ఈ ఏడాది వరకు తమ భూముల్లో పంటలు సాగు చేసే సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి పంట నమోదు ప్రక్రియకు వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు వైఎస్సార్ సీపీ పాలన స్వర్ణ యుగంలా నడిచింది. పండించిన పంటలకు మద్దతు ధర, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో నష్టపరిహారం పంపిణీ చేశారు. 2019 ఖరీఫ్ సీజన్ నుంచి జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి రైతు వేసిన పంటలను ఈ–క్రాప్ నమోదు చేయించి ఉచిత పంటల బీమా అమలు చేశారు. రైతులు సాగు చేసే మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించింది. సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా పథకం వర్తించడంతో పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో రైతులకు పరిహారం అందించారు. వైఎస్సార్ ఇన్‌పుట్ సబ్సిడీ కింద 50,878 మంది రైతులకు రూ.23.27 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు 4,20,980 మంది రైతులకు రూ.245.68 కోట్లు అందించింది. 2023–24 వ్యవసాయ సీజన్‌లో మిర్చి క్వింటా రూ.22– రూ.23 వేల ధర పలికింది. అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే రూ.10 వేలకు పడిపోయింది.


