అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించండి

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: జిల్లాలో పూర్తిగా వెనకబడిన ప్రాంతమైన యర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా పేరుకొని పోయి ఉన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలను కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగుల ఉపాధి పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యసేవల కోసం మంగళగిరిలోని ఎయిమ్స్‌ వైద్యశాలకు వెళ్తుంటారని, అక్కడికి వెళ్లేందుకు రోగులు, గర్భిణులు, వృద్ధులు, అత్యవసర వైద్య అవసరాల దృష్ట్యా నేరుగా బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఆయన కోరారు. జాతీయ రహదారి నియోజకవర్గ కేంద్రం గుండా వెళ్తుందని, సరైన లైటింగ్‌, సైన్‌ బోర్డులు లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి అర్హత ఉన్నప్పటికీ వారిని జాబితాలో చేర్చలేదని, వారికి న్యాయం జరిగేలా ప్రత్యేక పరిశీలనచేసి వెంటనే వారిని పునరావాస జాబితాలో చేర్చాలన్నారు. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానళ్లు, లైట్లు, ఫ్యాన్లు చెడిపోవడం వలన గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు గ్రామాలకు వెళ్లడంలేదని, సోలార్‌ వ్యవస్థల నిర్వహణ కోసం ప్రత్యేక టెక్నీషియన్‌ను నియమించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర ప్రాతిపదికన రోడ్ల పనులు చేపట్టాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయకపోవడంతో గ్రామీణ తాగునీటి నిర్వహణ పనులు నిలిచిపోయాయని, కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు విడుదలచేసి తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement