ప్రభుత్వ ఆస్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి విక్రయిస్తున్న వైనం అభివృద్ధి పేరుతో కబ్జాదారులను కాపాడేందుకు ఊర చెరువు ప్రాజెక్టుకు రూపకల్పన ప్రజల తరఫున అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తుల కోసం న్యాయ పోరాటం వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్
అద్దంకి: మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండదండలతో అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన పచ్చ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ధ్వజమెత్తారు. మంత్రి అండదండ లేకుంటే చెరువులను పట్టా ల్యాండుగా మార్చే అధికారం ఎవరికి ఉందని ప్రశ్నించారు. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేసి, నిస్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలో భూ కబ్జాలపై ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. కోర్టుల నుంచి తెచ్చిన ఆధారాలను చూపుతూ కబ్జాలు ఎలా చేశారో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, కుంటల భూములు నిషేధ భూముల జాబితాలో నుంచి తొలగించడం ఎక్కడా వీలు కాదన్నారు. అద్దంకిలో చెరువులు, కుంటలను పట్టా ల్యాండ్‌లుగా మార్చడం చాలా సులభమని ఎద్దేవా చేశారు. ఆ ప్రక్రియ చాలా సులువు గా జరిగిపోతోందన్నారు. అదేమని ఉన్నతాధికారులను అడిగితే మీరు న్యాయ పరంగా వెళ్లండని చెప్పడం వింటే ఆశ్చర్యం వేస్తోందన్నారు.
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించినవివీ..
మండలంలోని కలవకూరు గ్రామ సర్వే నంబరు 1928లో 1954కు ముందు నుంచి ఈనాంగా 14.83 ఎకరాల భూమి ఉందని చింతలపూడి తెలిపారు. అది ఆగస్టు నెల 7వ తేదీ 2025న పట్టా ల్యాండ్‌గా కన్వర్ట్ చేశారని చెప్పారు. ఉత్తర అద్దంకిలోని సర్వే నంబరు 1926లో 6.36 ఎకరాల కుంట పోరంబోకును పోరంబోకు భూమిగా మార్చారన్నారు. అందులో 11 సెంట్లు కాలువగా చూపి, మిగిలిన దానిలో కుంట ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. ఇదంతా మీ టీడీపీ సానుభూతిపరుడే హైకోర్టులో వేసి బయటకు తీయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అది మీ ఆస్థాన పత్రికలో రావడం నిజం కాదా? అతన్ని బెదిరిస్తే బెదిరిపోయి, హైకోర్టులో కేస్ విత్‌డ్రా చేసుకోబోతే, కోర్టు అతనికి మొట్టికాయలు వేసి, ఆ భూమికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేదని, తీర్పును వెలువరించిన విషయాన్ని ఉటంకించారు.
కబ్జాలను కాపాడేందుకే ఊరచెరువు ప్రాజెక్టు..
తన వారి కబ్జాలను కాపాడేందుకే ఊరచెరువు ప్రాజెక్టును మంత్రి బయటకు తెచ్చారని చింతలపూడి ఆరోపించారు. చెరువు ఆక్రమణలు తొలగించి అందులో అభివృద్ధి చేస్తే అభినందించడానికి తాను ముందుంటానన్నారు. సర్వేనంబరు 95 నంబర్‌లో ఏక మొత్తంగా 132 ఎకరాల ఊర చెరువు విిస్తీర్ణం ఉందన్నారు. అందులో కొంత మంది నిరుపేదలు నిలవడానికి తావు లేక గుడిసెలు వేసుకుంటే అది బూచిగా చూపి కబ్జాలు చేశారన్నారు. అధికారులు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం చెరువులోని 32 ఎకరాల్లో ఇంటి నిర్మాణాలు, ఐదెకరాల్లో రోడ్లు ఉండగా, 1.80 ఎకరాల్లో శ్మశానం, ఒక ఎకరంలో ప్రభుత్వ భవనాలు ఉన్నాయన్నారు. 32.42 ఎకరాలు ఆక్రమణలకు గురైందని చెప్పారు. అందులో 338 మంది ఆక్రమణదారులు ఉండగా, అందులో 150 మంది నిరుపేదలని వివరించారు. దానిపై స్థానికుడు కోర్టుకు వెళితే ఆక్రమణలు తొలగించాలని కోర్టు తీర్పు ఇస్తే ఇంత వరకూ అధికారులు ఏ చర్య తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దానిపై రిట్ వేయడం, అధికారులు పెనాల్టీ కట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
పేదల పక్షాన నిలబడతా..
తెలియక రియల్టర్ల మాయలో పడి ప్రభుత్వ ఆస్తులు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చింతలపూడి డిమాండ్ చేశారు. వారి పక్షాన తాను అండగా నిలబడతానన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోర్టు మెట్లు ఎక్కించి పేదలకు పరిహారం ఇప్పించేలా చూస్తామని హెచ్చరించారు. పార్టీ తరఫున, పేదల తరఫున న్యాయ పోరాటం చేస్తానన్నారు. కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జ్యోతి రోశయ్య, శింగరకొండపాలెం మాజీ సర్పంచ్ యెర్రిబోయిన వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లక్కెనబోయిన రవి, రావినూతల గ్రామపార్టీ అధ్యక్షుడు రఘురామయ్య ఉన్నారు.


