ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓగా ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ సంయుక్త డైరెక్టర్ సీవీ రేణుక సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా డీఈఓ గా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయా అధికారులు తమ రెగ్యులర్ బాధ్యతలతో పాటు ఈ అదనపు బాధ్యతలను నిర్వహించాలని, వెంటనే బాధ్యతలు స్వీకరించి నివేదిక అందజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి (2024–25 అడ్మిటెడ్ బ్యాచ్) నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్.మూర్తి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 894 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 92.62 ఉత్తీర్ణత శాతంతో 828 మంది విద్యార్థులు పాసైనట్లు సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ స్థాయిలోను, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర అభినందించారు. నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ.అమృతవల్లి దేవి, బీఎడ్ కోర్సుల కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.


