ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం

Aug 5 2026 6:46 AM | Updated on Aug 5 2026 6:46 AM

ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం

ముండ్లమూరు: ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు సైకోలా వీరంగం సృష్టించాడు. కండక్టర్‌ను దూషించడమే కాకుండా, అడ్డుకున్న ప్రయాణికుడిపై స్క్రూ డ్రైవర్‌తో దాడికి తెగబడ్డాడు. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే బస్సు అద్దాలు పగులగొట్టి, వైర్లు కత్తిరించి నానా హంగామా చేశాడు. ముండ్లమూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉల్లగల్లుకు చెందిన మోతుకూరి వంశీ కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పొదిలి నుంచి అద్దంకి వెళ్తుండగా ఉల్లగల్లులో అతడు బస్సు ఎక్కాడు. కండక్టర్‌ అన్నమ్మ టికెట్లు ఇస్తుండగా, వంశీ ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. దీన్ని గమనించిన పసుపుగల్లుకు చెందిన ప్రయాణికుడు సారెడ్డి అమరారెడ్డి.. కండక్టర్‌ను ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన వంశీ తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్‌తో అమరారెడ్డిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనతో బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్‌ పుల్లారావు చాకచక్యంగా వ్యవహరించి నేరుగా ముండ్లమూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద బస్సు నిలిపాడు. పోలీసులు బయటకు వచ్చేలోపే వంశీ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు, స్టీరింగ్‌ వద్ద ఉన్న వైర్లను పీకేశాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నిందితుడు వంశీ గతంలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement