ఒంగోలు టౌన్: బీసీ హాస్టల్‌కు చెందిన బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితులకు ఆదివారం రిమాండ్ విధించారు. మద్దిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు జరుగుమల్లి మండలంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ జిల్లా పరిషత్ హైస్కూలులో చదువుకుంటున్నారు. హాస్టల్‌లో పనిచేసే వంట మనిషి శారద ఆ బాలికలను మాయమాటలతో ఒంగోలులోని గోపాల్ నగర్‌లో నివాసం వుంటున్న బట్టు వెంకటరావు ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు వంట మనిషి శారద, కామాంధుడు బట్టు వెంకటరావులను అరెస్టు చేసిన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.
జె.పంగులూరు: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బూదవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సురేష్(35) స్తంభంపై వీధి లైట్లు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అద్దంకి: ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి ఒడిశా కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి మండలంలోని జార్లపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మిక్సా సోనా(50) గత ఐదేళ్లలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోళ్లఫారంలో కోళ్లకు మేత పెట్టేందుకు ఫారంలోకి వెళ్లిన సోనా అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసునమోదుతో దర్యాప్తు చేస్తున్నారు.
కంభం: ఉద్యోగాల పేరుతో మోసగించిన వ్యక్తిపై స్ధానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు మండలంలోని పెద్దనల్లకాలువ గ్రామానికి చెందిన పి.ఎలిషారాజకుమార్ మూడు నెల క్రితం కుటుంంలోని టీ స్టాల్ వద్ద శ్రీకాకుళంకు చెందిన చెరుకూరి శ్రీను పరిచయమయ్యాడు. చేరుకూరి శ్రీను..రాజుకుమార్‌కు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి అతడి వద్ద రూ.66.500 నగదు తీసుకున్నారు. అలాగే మరికొందరి వద్ద రూ.4.88 లక్షలు, రూ.1.21 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామక్రిష్ణారెడ్డి తెలిపారు.
● తాలూకా పోలీసు స్టేషన్లో చుండూరి
రవిబాబు ఫిర్యాదు
ఒంగోలు టౌన్: ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సంబంధించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిన విమర్శలకు సరైన సమాధానం చెప్పకుండా కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం, బాడీ షేమింగ్ విమర్శలు చేయడంపై వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆదివారం సాయంత్రం ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను ఒంగోలు సంస్థ అందరిదని, పార్టీలకతీతంగా వేడుకలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేసిన విమర్శలను సహించలేకపోవడం బాధాకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మదన్ మోహన్, మార్కెట్ యార్డు చైర్మన్ సిరిపురం వెంకటరావు, గుర్రాల రాజ్ విమల్ తదితరులు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యక్తిగత విమర్శలపై తగిన విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చుండూరి రవిబాబు వెంట పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, తదితరులు ఉన్నారు.
అద్దంకి: బైకు అదుపు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ యువకునికి గాయాలైయ్యాయి. ఈ ఘటన మండలంలోని కుంకుపాడు గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన మణికంఠ అనే యువకుడు మరో యువకుని బైకుపై ఎక్కించుకుని కుంకుపాడు గ్రామం వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని కాలువలోకి బైకు అదుపు తప్పిదూసుకెళ్లింది. దాంతో ఆ యువకునికి గాయాలైయ్యాయి. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది యువకుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


