కందుకూరు: సింగరాయకొండ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన తౌశిక్ మృతి వెనుక దాగి ఉన్న నిజాలు బయటకు రావాలంటే సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. తౌశిక్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 12న ఒంగోలులో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆద్వర్యంలో ఆదివారం స్థానిక కృష్ణ పంక్షన్ హాల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ తౌశిక్ అనే ఐదో తరగతి విద్యార్థి మృతి ముమ్మాటికీ హత్యేనని స్పష్టం చేశారు. తల్లి మౌలాబి పోరాటం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఆమె పోరాటానికి సమాజం నుంచి సరైన మద్ధతు లభించకపోవడంతోనే నిస్సాహాయ స్థితిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. తౌశిక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎంతవరకై నా పోరాడేందుకు సిద్ధమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వివరించారు. పోరాటానికి అన్ని ప్రజా సంఘాలు, కలిసొచ్చే రాజకీయ పార్టీల మద్ధతు తీసుకుంటామని చెప్పారు. దీనిలో భాగంగా ఈనెల 12వ తేదీన ఒంగోలులో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50వేల మంది ఈ ధర్నాలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదు..
తౌశిక్ మృతిపై కలెక్టర్ నియమించిన త్రిమెన్‌కమిటీ నివేదిక, ఏఎస్పీ స్థాయి అధికారితో చేయించిన విచారణ నివేదికను ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. తౌశిక్ మృతి వ్యవహారాన్ని, అందులో ఉన్న కుట్రలు బయటకు రాకుండా పూర్తిగా అధికారులు పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సీఎంఓ స్థాయిలో కూడా తౌశిక్ మృతిపై సంఘటనపై తప్పుడు నివేదికలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలం బలహీన వర్గాలకు చెందిన కుటుంబం కాబట్టే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వీరయ్యచౌదరి, దారకానిపాడు సంఘటనల్లో ప్రభుత్వ పెద్దలు ఆఘమేఘాలపై స్పందించి ఆ కుటుంబాలకి న్యాయం చేశాయని, అదే తౌశిక్ కుటుంబం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మహాధర్నా తరువాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు. ఎమ్మార్పీఎస్ నాయకులు వర్లదేవదాసుమాదిగ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ సైదా, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్‌బాబు, ఆమ్‌ఆద్మీపార్టీ నాయకుడు నేతి మహేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ రహీం, బిటిఎ నాయకుడు అబ్దుల్లా, ముస్లిం మతపెద్దలు రియాజ్‌మౌలానా, షేక్ కరిముల్లా, సంధాని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దారవీడు: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన మండల పరిధిలో కొండారెడ్డికాలనీ సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు తోకపల్లి గ్రామానికి చెందిన నరాల వెంకటేశ్వరు(50) స్కూటర్‌పై హనుమాన్‌జంక్షన్ కుంట నుంచి కొండారెడ్డికాలనీ దగ్గరలో ఉన్న తన పొలం చూసేందుకు వెళ్తున్నారు. కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుండి కర్నూల్‌కు వెళ్తుంది. మార్గమధ్యంలో జాతీయ రహదారి కొండారెడ్డికాలనీ సమీపంలోకి రాగానే స్కూటర్‌పై వెళ్తున్న నరాల వెంటేశ్వర్లును (50) వెనకాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలింది. స్థానికులు వెంటనే 108 సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది గాయాలైన వ్యక్తిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య, పిల్లలు, బంధువులు కన్నీరు మున్నీరైయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదుబాబు తెలిపారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
12న ఒంగోలు 50వేల మందితో మహాధర్నా
రౌండ్‌టేబుల్ సమావేశంలో మందా కృష్ణమాదిగ


