ఎన్నికలు ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎదుర్కొందాం

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుదాం ఒంగోలులో గెలిచి జగనన్నకు గిఫ్ట్‌ ఇద్దాం సామాన్యులకు, పేదలకు అండగా ఉండటమే వైఎస్సార్‌ సీపీ లక్ష్యం కేసులు, జైళ్లకు భయపడేదిలేదు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటామన్న బూచేపల్లి

సమరోత్సాహంతో
మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలకు ఘన సన్మానం

ఒంగోలు సిటీ/ఒంగోలు టౌన్‌: జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీకి బలం ఉందని, కూటమి పార్టీల అరాచక పాలన పట్ల వ్యతిరేకత ఉందని, ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఒంగోలు మేయర్‌ స్థానంలో గెలిచి జగనన్నకు గిఫ్ట్‌గా ఇద్దామని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. 2029 ఎన్నికలకు ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల నుంచే పునాదులు పడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి చంద్రబాబు మోసాల గురించి ప్రచారం చేయాలని సూచించారు. ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ ఒంగోలు నగర, ఒంగోలు మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయడంలేదన్న ఆగ్రహం ప్రజల్లో ఉందని, జగనన్న హయాంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. అన్నదాతలు మద్దతు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌తో సహా జిల్లాలోని అన్నీ మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను గెలుచుకునేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రకాశమే నంబర్‌ వన్‌: ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

వైఎస్సార్‌ సీపీకి కడప నంబర్‌ వన్‌ అంటారు కానీ ఇక్కడ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ప్రకాశం జిల్లానే నంబర్‌ వన్‌గా కనిపిస్తుందని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పారు. సామాన్య ప్రజలకు, నిరుపేదలకు అండగా నిలబడేందుకు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే వైఎస్సార్‌ సీపీ పనిచేస్తుందని తెలిపారు. సమర్థవంతుడైన జిల్లా అధ్యక్షుడిని జగనన్న ఇచ్చారనని చెప్పారు. జిల్లాకు కెప్టన్‌ బూచేపల్లి అని, ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయదుంధుభి మోగించడం ఖాయమన్నారు.

కేసులకు భయపడేది లేదు: చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తన మీద కేసులు వేసి జైలుకు పంపించడం అలవాటుగా మారిందని ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే 111 కేసులు పెట్టాడని, గతంలో 7 నెలలు జైలుకు పంపిస్తే ఈసారి 8 నెలలు జైలుకు పంపించాడని వివరించారు. జైలుకు వెళ్లడం అవమానంగా భావించడంలేదని, కొంతకాలం విశ్రాంతి తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు. అసమర్ధుడు మాత్రమే కేసులు, జైళ్లతో గెలవాలని ప్రయత్నిస్తాడని, సమర్ధుడు దాన్ని ఎదుర్కొంటాడని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కేసులకు భయపడొద్దని, పార్టీ కోసం చేసిన త్యాగాలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తు పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరగరానిది జరిగితే పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లోని అన్నీ స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా గెలుపు కోసం చివరిదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. ఒంగోలు మేయర్‌ స్థానాన్ని తప్పకుండా గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు.

సంక్షేమ పాలన కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించండి: బూచేపల్లి వెంకాయమ్మ

పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన పాలన కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ప్రజలు మద్దతుగా నిలవాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేశామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేయాలంటే పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

గట్టిగా పోరాడితేనే విజయం: తాటిపర్తి చంద్రశేఖర్‌

గట్టిగా నిలబడి పోరాడితే ఎంత గొప్పవాడైనా ఓడిపోక తప్పదని వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ చెప్పారు. ఈవీఎంలతో అడ్డుకున్నా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌ సీపీ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. ఒంగోలు నగర 150 సంవత్సరాల వేడుకల్లో పోలీసులు, పచ్చపార్టీ నాయకులు తప్ప ప్రజలు కనిపించలేదని చెప్పారు. అదే జగనన్న ఒంగోలుకు వస్తే జనం సునామీలా తరలి వచ్చారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్‌ సీపీ సత్తా చాటుతామన్నారు.

150 వేడుకల్లో వసూలు చేసిన డబ్బుల లెక్కలు చెప్పాలి: చుండూరి రవిబాబు

నగర కార్పొరేషన్‌ తరఫున నిర్వహించిన 150 సంవత్సరాల వేడుకలకు పట్టణ ప్రముఖులు, ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దమ్ముంటే వేడుకల పేరుతో వసూలు చేసిన డబ్బులకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు సవాల్‌ విసిరారు. అప్పుడు మీ బండారం బయటపడుతుందని విమర్శించారు. టీడీపీ పాలనలో డివైడర్లకు రంగులు వేయడం, లైట్లు వేయడం మినహా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నగరంలో చెత్త పేరుకొని పోయి దోమలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే ఓపిక, తీరిక లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనను అడ్డుపెట్టుకొని తాను టీటీడీకి బియ్యం సరఫరా చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఒక్క గింజ సరఫరా చేసినట్లు రుజువు చేస్తే తాను దేనికై నా సిద్ధమేనని తేల్చి చెప్పారు.

ఒంగోలును అభివృద్ధి పథంలో నడిపిన ఘనత వెంకాయమ్మది: బత్తుల బ్రహ్మానందరెడ్డి

జెడ్పీ చైర్‌పర్సన్‌ గా పనిచేసిన బూచేపల్లి వెంకాయమ్మ ఉన్న ఐదేళ్లలో ఒంగోలును అభివృద్ధి పథంలో నడిపించారని ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి: జంకె వెంకటరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్నీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లను గెలిపించి జగనన్న పక్షాన నిలబెట్టాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలి: పుత్తా శివశంకర్‌రెడ్డి

ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం సమన్వయం చేసుకోవాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పుత్తా శివశంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆర్థికంగా పార్టీలోనే ఉండి జగన్‌మోహన్‌రెడ్డికి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అండగా ఉన్నారని కొనియాడారు.

బూచేపల్లి కాదు మనసు దోచేపల్లి: మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. తనదైన శైలిలో ప్రాసలతో ఆయన నాయకులకు కితాబు ఇవ్వడంతో కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి కుటుంబం చేసిన సేవలను కొనియాడుతూ బూచేపల్లి కాదు మనసు దోచేపల్లి అంటూ కితాబిచ్చారు. జగన్‌ మెచ్చిన నాయకుడు తాటిపర్తి చంద్రశేఖర్‌ అని ప్రశంసించారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన గుంటూరు జెడ్పీ చైర్మన్‌ పార్టీ మారారని విమర్శించిన ఆయన బూచేపల్లి వెంకాయమ్మ కథనాయకిలా నిలబడి కలబడ్డారని కొనియాడారు.

బెదిరింపులకు తలొగ్గని బూచేపల్లి

వెంకాయమ్మ: మేరుగు నాగార్జున

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొడ్డి దారిన జిల్లా పరిషత్‌ను కై వసం చేసుకునేందుకు కూటమి పాలకులు అనేక ప్రయత్నాలు చేశారని సంతనూతలపాడు ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. నిన్ను తీసేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినా అదరక బెదరక తన పదవిని నిలబెట్టుకున్న వీరనారీమణి బూచేపల్లి వెంకాయమ్మ అని కొనియాడారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం ఆమె వెంట నిలబడి చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడాలని కోరారు.

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి: అన్నా రాంబాబు

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనకంజ వేయకుండా చివరిదాకా పోరాడాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుతో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని, తద్వారా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు.

కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి: బుర్రా మధుసూదన్‌యాదవ్‌

నాయకులు, కార్యకర్తలు పార్టీకి బలమని, గ్రామస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పోరాడితే గెలుపు సాధ్యం: దద్దాల నారాయణ యాదవ్‌

పోరాడితేనే గెలుపు సాధ్యమవుతుందని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కనిగిరి ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌ కోరారు. కనిగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక స్థానాలు గెలిచి తీసుకొస్తామని చెప్పారు.

సమావేశంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బొట్ల రామారావు, కఠారి శంకరరావు, ఇమ్రాన్‌ ఖాన్‌, వేమా శ్రీనివాసరావు, లంకపోతు అంజిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ టీటీడీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మను శాలువా, పూలమాలతో సన్మానించి మెమొంటో అందజేశారు. అలాగే జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌లు ఎన్నాబత్తిన అరుణమ్మ, చుండి సుజ్ఞానమ్మలను శాలువతో సన్మానించి మెమొంటోలు అందజేశారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తాజా మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలను శాలువాలు, పూలమాలలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. పార్టీ బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement