స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పండి

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

సంతమాగులూరు(అద్దంకి, అద్దంకి రూరల్‌): ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని వెల్లలచెరువులో ఆదివారం రాత్రి వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎంపీలు నందిగం సురేష్‌, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గొప్ప కార్యక్రమాలు చేసిన ఒకే ఒక్క నాయకుడు, మహానీయుడు వైఎస్సార్‌ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో పథకాలను ఆయన అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మరణాంతరం ఆయన ఆశయాలకు అనుగుణంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రభుత్వ పథకాలను వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే చేర్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం అటకెక్కాయన్నారు. కూటమి పాలనపై ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి మరోసారి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ అభ్యర్థిగా చింతలపూడిని అత్యధిక మెజారీటీతో గెలిపించాలని కోరారు.

విగ్రహాల ధ్వంసం సరైంది కాదు..

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. కూటమి పాలనలో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా కూటమి నాయకులు దోచుకుంటున్నారన్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. స్థానిక ఎన్నికలను నిర్వహించే పరిస్థితుల్లో కూటమి లేదన్నారు. అద్దంకి ఇన్‌చార్జి అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలేదని లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి బుద్ధి చెబుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేసి కూటమికి భయపడకుండా ఎన్నికలు చేయాలని పిలుపునిచ్చారు. తొలుత ఇన్‌చార్జి జన్మదినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో పార్టీయూత్‌ జాయింట్‌ సెక్రటరీ గడ్డం సుబ్బారెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్‌ డి.సుబ్బారావు, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు వైఎస్సార్‌

వైఎస్సార్‌ విగ్రహావిష్కరణలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement