మార్కాపురం టౌన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జిల్లాలో ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్. సుబ్బారావు మంగళవారం తెలిపారు. మార్కాపురం పట్టణంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి జిల్లా స్థాయిలో శ్రీటెట్ సెల్‌శ్రీను ఏర్పాటు చేశామని, వివరాలకు 98859 34789, 63022 43533ను సంప్రదించవచ్చని సూచించారు. పరీక్షా కేంద్రాలకు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని, పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను హాలులోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
సంతనూతలపాడు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంతనూతలపాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక అంబేడ్కర్ కాలనీకి చెందిన కసుకుర్తి వాణికుమారి(33) సోమవారం సాయంత్రం సంఘం కాలనీలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై అజయ్ బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె భర్త వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు
ఒంగోలు టౌన్: ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుల నివాసాలు పశువుల పాకలను తలపిస్తున్నాయని, ప్రైవేటు సంస్థల్లో కార్మిక చట్టాలు అమలు కాక వారి బతుకులు బండబారుతున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఒంగోలులోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 30 నుంచి జులై 31 వరకు జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో 46 బృందాలతో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. 50 రకాల పనులు చేస్తున్న కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. గ్రానైట్, ఆక్వా, మాల్స్, ఆస్పత్రుల్లో 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేయించుకుంటూ కేవలం రూ.300 నుంచి రూ.500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. కలెక్టర్ నిర్ణయించిన కనీస వేతనం(రూ.708 నుంచి రూ.1062 వరకు) అమలు కావడం లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 6 నుంచి 12 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కలెక్టర్, కార్మిక శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని బకాయిలు ఇప్పించడంతో పాటు, ప్రతి నెలా కనీస వేతనం అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పి.కల్పన, మంజుదార్, జి.శ్రీనివాసులు, రమేష్ పాల్గొన్నారు.


