● అధికారులతో సమీక్షలో కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సంబంధిత అధికారులతో ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులను ప్రస్తుతం అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించినందున తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం అన్ని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో 27 జెడ్పీటీసీలు, 373 ఎంపీటీసీలు, 517 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాల్సి ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి రావాల్సిన సామగ్రి వచ్చినందున, స్థానికంగా సమకూర్చుకోవాల్సిన సామగ్రి కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మున్సిపాలిటీల విషయంలో కందుకూరు మినహా ఇతర అన్ని మున్సిపాలిటీల్లో అవసరమైన చర్యలు ముమ్మరం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ పి.వెంకటరమణ, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ అనుపమ పాల్గొన్నారు.


