పుల్లలచెరువు: పొట్ట కూటి కోసం పక్క జిల్లా నుంచి వచ్చిన కుటుంబంలోని మహిళ.. కుటుంబ కలహాలతో కనిపించకుండా పోయి చివరకు చెరువులో శవమై తేలింది. పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో శనివారం వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా దుర్గికి చెందిన బుడుగు జంగాలకు చెందిన కళ్లెం సాములయ్య, శివపార్వతి 22) దంపతులు పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలోని బంధువుల వద్దకు వచ్చి ఇక్కడ గుడారాలు వేసుకుని సంచార వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శివపార్వతి శుక్రవారం రాత్రి కనిపించకుండా పోయింది. శనివారం ఉదయం పశువుల కాపరులు స్థానిక చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా, చెరువులోని నీటిలో మహిళ మృతదేహం కనిపించింది. గ్రామస్తులు పరిశీలించి శివపార్వతిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా..లేకుంటే మరేమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సాంబశివరావు తెలిపారు.
కంభం: పట్టణంలోని కోనేటివీధిలో నివాసం ఉంటున్న షేక్ ముంతాజ్ (20) అనే యువతి అదృశ్యమైన ఘటనపై కంభం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ ముంతాజ్ గత గురువారం ఉదయం 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పుటికీ ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు కంభం పోలీస్‌స్టేషన్ (91211 02184)కు సమాచారం అందించాలని కోరారు.


