దిక్సూచి.. | - | Sakshi
Sakshi News home page

దిక్సూచి..

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

అభివృద్ధి మార్క్‌తో ఉమ్మడి ప్రకాశం జిల్లాపై వెంకాయమ్మ చెరగని ముద్ర జెడ్పీ చైర్‌పర్సన్‌గా తనదైన శైలిలో రాణింపు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట గత ఐదేళ్లలో రూ.112 కోట్లకుపైగా అభివృద్ధి పనులు రూ.125 కోట్లతో తాగునీటి పనులు ఆమె చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ నేడు అభినందన సభ

అభివృద్ధికి

కారుణ్య నియామకపత్రాలు అందిస్తున్న జెడ్పీచైర్‌పర్సన్‌ వెంకాయమ్మ (ఫైల్‌)

నూతనంగా నిర్మించిన చీమకుర్తి జెడ్పీ బాలికల హైస్కూల్‌ భవనం వద్ద వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అభివృద్ధే మంత్రంగా పనిచేసి మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లె వెంకాయమ్మ ఉమ్మడి ప్రకాశం జిల్లాపై చెరగని ముద్ర వేశారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని, ఆయన తనయుడు వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో పయనించి తన మార్కు అభివృద్ధితో జిల్లాలో వెలుగులు నింపారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా తన ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయడంతోపాటు, పారదర్శక పాలన అందించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి ‘ఐరన్‌ లేడీ’గా గుర్తింపు పొందారు. గత జిల్లా పరిషత్‌ పాలక వర్గం చేసిన సేవలకు గుర్తింపుగా నేడు ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బూచేపల్లె వెంకాయమ్మ ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకొన్నారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత....

జిల్లా పరిషత్‌లో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినట్లు వెంకాయమ్మ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునే 20 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. మొత్తం మీద 200 మందిని కారుణ్య నియామకాల కింద శాశ్వత ఉద్యోగులుగా నియమించినట్లు తెలిపారు. ఇందులో 44 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 57 మంది ఆఫీసు సబార్డినేట్లు, 14 మంది టైపిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. 40 మందికి సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి ఏఓలుగా, 73 మందిని జూనియర్‌ అసిస్టెంట్ల నుంచి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోస్నతులు కల్పించినట్లు వివరించారు. అలాగే రికార్డు అసిస్టెంట్ల నుంచి జూనియర్‌ అసిస్టెంట్లుగా 21 మందికి, రికార్డు అసిస్టెంట్ల నుంచి టైపిస్టులుగా నలుగురికి మొత్తం 136 మందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు.

దర్శిలో అభివృద్ధి పనులు ఇలా...

దర్శి, దొనకొండ, ముండ్లమూరు మండలాల్లో హైస్కూళ్లు, కస్తూరిబా, మోడల్‌ స్కూళ్లల్లో గ్రౌండ్‌ లెవలింగ్‌లు, సైకిల్‌ స్టాండ్‌లు, వాటర్‌ ప్లాంట్ల నిర్మాణం చేశామన్నారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, సైడ్‌ కాలువలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మహిళా భవనాల నిర్మాణాల కోసం నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన...

గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి పనులకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసినట్లు వెంకాయమ్మ తెలిపారు. గత ఐదేళ్లలో రూ.112.6 కోట్లతో 2,231 అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రూ.115 కోట్ల పనులు మంజూరు చేసి ప్రజల దాహార్తి తీర్చేలా కృషి చేశామన్నారు. విద్యా రంగంపై దృష్టి పెట్టి స్కూళ్ల రూపురేఖలు మార్చినట్లు వివరించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించామన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, అధికారులు అందరి సహకారంతో కలిసికట్టుగా సమష్టిగా నిర్ణయాలు తీసుకొని, జిల్లాను అభివృద్ధి బాటలో పయనించేలా చేశామని చెప్పారు.

బూచేపల్లి సుబ్బారెడ్డి బాటలో...

‘నా భర్త బూచేపల్లి సుబ్బారెడ్డి బాటలోనే నేను, మా తనయుడు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి ఇద్దరం కలిసి నడుస్తున్నాం. మనం చేతనైంత సహాయం చేయాలని చెప్పిన నా భర్త ఆశయాల మేరకే పారదర్శకంగా రాజకీయాలు చేస్తున్నట్లు’’ వివరించారు. చేతనైనంత వరకు పేద ప్రజలకు సాయం, దాన ధర్మాలు చేస్తున్నామని చెప్పారు. చీమకుర్తిలో బాలికలకు హైస్కూలు ఏర్పాటు చేసి తన భర్త కోరికను నెరవేర్చడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ఇలా బూచేపల్లి వెంకాయమ్మ అభివృద్ధి బాటలోనే కాదు..భక్తి భావనలోను మేటిగా నిలుస్తోంది. ఏటా అయ్యప్పమాల ధరిస్తూ ఆ సమయంలో చీమకుర్తిలోని కళ్యాణ మండపంలో మాలధారణ భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement